జట్టు నచ్చకపోతే మ్యాచ్‌లను చూడొద్దు..మాజీ కెప్టెన్ ఘాటు వ్యాఖ్యలు
X
ఆసియాకప్‌కు బీసీసీఐ ప్రకటించిన భారత్ జట్టపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా టీమ్ ఎంపికను క్రికెట్ అభిమానులు తప్పుబడుతున్నారు. చాహల్, అశ్విన్ వంటి మేటి స్పిన్నర్లను పక్కనబెట్టడం, సంజూశాంసన్‌ను స్టాండ్ బై ప్లేయర్‌గా ఎంపిక చేయడం విమర్శలకు తావిస్తోంది. ఎక్కువగా ముంబైకు ఆడిన క్రికెటర్స్‌ను మాత్రమే ఎంపిక చేశారని కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఫామ్‌లోని లేని కేఎల్ రాహుల్, పేలవ వన్డే రికార్డు కలిగి ఉన్న సూర్యకుమార్ యాదవ్ ల ఎంపిక కూడా సరైనది కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
జట్టు ఎంపికపై వస్తున్న విమర్శలను భారత మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ ఖండించారు. జట్టు విషయంలో ఎలాంటి వివాదాలకు తావుండదని చెప్పారు. ఓ చానెల్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న గవాస్కర్‌ను ఓ అభిమాని అశ్విన్‌ను ఎందుకు ఎంపిక చేయలేదని ప్రశ్నించగా..ఆగ్రహానికి గురయ్యాడు. జట్టు ఎంపిక ఇప్పటికే పూర్తయ్యిందని..ఇక దీనిపై మాట్లాడడం మానేయాలని సూచించారు. జట్టు మీకు నచ్చకపోతే మ్యాచ్ చూడకండి.. కానీ, అతన్ని ఎంపిక చేయాలి.. అతన్ని తీసుకోవాల్సింది అని చెప్పడం కరెక్ట్ కాదని గవాస్కర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆటగాళ్లెవరూ తమకు అన్యాయం జరిగిందని చెప్పుకోలేదని వెల్లడించారు. ఆసియా కప్ కోసం జట్టులో అనుభవజ్ఞులైన, ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లను ఎంపిక చేశారని వివరించారు. ఎవరి కోసం తలుపులు మూసివేయలేదని, జట్టులో కేవలం 17 మంది ఆటగాళ్లను మాత్రమే ఎంపిక చేయవచ్చని, అలాంటి పరిస్థితుల్లో కొందరిని జట్టు నుంచి దూరం పెట్టకతప్పదని సునీల్ గవాస్కర్ స్పష్టం చేశారు.