టీమిండియా ఎంపికపై సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు
X
భారత్ జట్టు వెస్టిండీస్‌లో పర్యటిస్తోంది. ఇటీవల టెస్ట్ సిరీస్‌ను కైవసం చేసుకొని వన్డే సిరీస్‌కు సిద్దమవుతోంది. ఈ సిరీస్‌లో యంగ్ ప్లేయర్ యశస్వి జైశ్వాల్‌తో పాటు సీనియర్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించారు. ఒక సెంచరీ, 2 అర్ధశతకాల సాయంతో కెప్టెన్ రోహిత్ 240 పరుగులు చేయగా, ఓ సెంచరీ, ఓ హాఫ్ సెంచరీ సాయంతో రన్ మిషన్ విరాట్ కోహ్లీ 197 పరుగులు చేశాడు. ఇద్దరు స్టార్స్ ప్లేయర్స్ మంచి టచ్‌లో కనిపించడంపై ప్రశంసలు వచ్చాయి. వరల్డ్ కప్ వరకు ఇదే ఫామ్ కొనసాగించాలని భారత్ అభిమానులు కోరుటుకుంటున్నారు.
అయితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీపై భారత్ మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసలు టీమిండియా జట్టులో వారిద్దరు ఎందుకని ప్రశ్నించాడు. వెస్టిండీస్ టూర్‌లో వారికి విశ్రాంతికి కల్పించి యువకులకు అవకాశం ఇవ్వాల్సిందని అభిప్రాయపడ్డాడు. పెద్దగా ప్రాధాన్యం లేని విండీస్ టూర్‌లో రోహిత్ శర్మ, విరాట్‌లను ఆడించాల్సిన అవసరం లేదన్నాడు. భారత సెలెక్షన్ కమిటీ నిర్ణయాలు తనను విస్మయానికి గురిచేస్తున్నాయని ఒక పత్రికకు రాసిన వ్యాసంలో సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు. సెలెక్షన్ కమిటీ చైర్మన్ గా భారత మాజీ పేసర్ అజిత్ అగార్కక్ నేతృత్వంలోనైనా జట్టు ఎంపికలో మార్పులు వస్తాయేమోనని సన్నీ ఆశాభావం వ్యక్తం చేశాడు.
ఇక వెస్టిండీస్ టూర్ కోసం..రంజీల్లో పరుగుల వరద పారిస్తున్న సర్ఫరాజ్‌ఖాన్‌ను పరిగణలోకి తీసుకోకపోవడంపై గతంలో సునీల్ గవాస్కర్ తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా కోహ్లీ, రోహిత్‌లపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.