IND vs NED : నెదర్లాండ్స్ను చిత్తు చేసిన భారత్.. లీగ్లో అజేయంగా టీమిండియా
X
వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా లీగ్ మ్యాచులకు అదిరిపోయే ముగింపునిచ్చింది. ఇప్పటి వరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి సెమీస్‌కు రెడీ అయింది. నెదర్లాండ్స్‌తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచులో టీమిండియా 160 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో నెదర్లాండ్స్ టీం 47.5 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌట్ అయింది. నెదర్లాండ్ బ్యాటర్లు తేజ నిడమనూరు 39 బంతుల్లో 1 ఫోర్, 6 సిక్సులు బాది 54 రన్స్ చేశాడు. ఎంగెల్‌బ్రెచ్ట్ 80 బంతుల్లో 4 ఫోర్లతో 45 పరుగులు, కోలిన్ అకెర్మాన్ 32 బాల్స్లో 6 ఫోర్లతో 35 రన్స్, మాక్స్ ఔడౌడ్ 42 బంతులు ఆడి 3 ఫోర్లు, 1 సిక్సుతో 30 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో బూమ్రా, సిరాజ్, కుల్‌దీప్ యాదవ్, జడేజా తలో రెండు వికెట్లు, కోహ్లీ, రోహిత్ శర్మ చెరో వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో భారత్ ఏకంగా 9 మంది బౌలర్లను ఉపయోగించింది. వికెట్ కీపర్ కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ మినహా మిగిలిన 9 మంది బౌలింగ్ చేయడం విశేషం.
అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా పరుగుల వరద పారించింది. టాప్ ఆర్డర్ బ్యాటర్లందరూ నెదర్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించారు. 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 410 పరుగులు చేసి నెదర్లాండ్ ముందు 411 పరుగుల భారీ లక్ష్యం ఉంచారు. టీమిండియా బ్యాటర్లు మ్యాచ్ ప్రారంభం నుంచి దూకుడుగా ఆడారు. కెప్టెన్ రోహిత్ శర్మ 54 బాల్స్లో 8ఫోర్లు, 2 సిక్సర్లతో 61 రన్స్ చేశాడు. శుభ్ మన్ గిల్ 32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 51 పరుగులు చేశాడు. 11.5 ఓవర్లలో వీరు 100 పరుగుల భాగస్వామ్యం చేశారు. వాన్ మాకీరన్ బౌలింగ్‌లో తేజకు క్యాచ్ ఇచ్చి గిల్ వెనుదిరిగగా.. కొద్దిసేపటికే రోహిత్ శర్మ కూడా బాస్ డీ లీడా బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ 56 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్ తో 51 రన్స్ చేశారు. హాఫ్ సెంచరీతో జోరుమీదున్న కోహ్లీని మెర్వీ ఔట్ చేశాడు.
ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ శతకాలతో వీర విహారం చేశారు. శ్రేయస్ అయ్యర్ 10 ఫోర్లు, 5 సిక్సర్లతో 84 బాల్స్లోనే మూడంకెల స్కోరు అందుకున్నాడు. 94 బాల్స్ ఎదుర్కొన్న ఆయన.. 10 ఫోర్సు, 5 సిక్సర్లతో 128 పరుగులు చేశాడు. ఇక వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ 11 ఫోర్లు, 4 సిక్సులతో నెదర్లాండ్ బౌలర్లను బెంబేలెత్తించాడు. 62 బాల్స్లోనే సెంచరీ పూర్తి చేశాడు. 64 బంతుల్లో 102 పరుగులు చేసిన రాహుల్.. చివరి ఓవర్ ఐదో బంతికి సైబ్రాండ్‌కు క్యాచ్ ఇచ్చాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు ఏకంగా 208 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ 2 (1) రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. నెదర్లాండ్స్ బౌలర్లలో బాస్ డీ లీడీ రెండు వికెట్లు తీయగా, వాన్ డెర్ మెర్వీ, పాల్ వాన్ మీకిరన్ చెరో వికెట్ తీశారు.