ఏ కష్టానికి తలొగ్గలేదు.. ఎదిరించి నిలబడ్డాడు.. కన్నీళ్లు పెట్టించే షమీ జీవితం
X
సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచకప్ లో టీమిండియా పేస్ బౌలర్ మహమ్మద్ షమీ రెచ్చిపోతున్నాడు. కీలక సమయంలో వికెట్లు పడగొట్టి జట్టుకు విజయాలను అందిస్తున్నాడు. మొదట కొన్ని మ్యాచ్ లకు బెంచ్ కే పరిమింతమైన షమీ.. హార్దిక్ పాండ్యా గాయంతో జట్టు దూరం అవడంతో షమీకి స్థానం లభించింది. మొదటి మ్యాచ్ నుంచి తన ప్రతాపం చూపెట్టడం మొదలుపెట్టిన షమీ.. 6 మ్యాచుల్లో 23 వికెట్లు పడగొట్టాడు. అందులో మూడుసార్లు ఐదు వికెట్లు పడగొట్టాడు. న్యూజింలాండ్ తో జరిగిన సెమీ ఫైనల్ లో అద్భుతంగా బౌలింగ్ చేసి మ్యాచ్ ను మలుపుతిప్పాడు. 7 వికెట్లు పడగొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు. దాంతో దేశం మొత్తం షమీని పొగడటం మొదలుపెట్టింది. అయితే ఆ పొగడ్తలేవీ షమీకి అంతసులువుగా రాలేదు. తన జీవితం మొత్తం కష్టాలనే అనుభవించాడు.
ఉత్తరప్రదేశ్ లోని ఓ మారుమూల గ్రామంలో రైతు బిడ్డగా జన్మించిన షమీ.. తన తండ్రి ఆశయాన్ని నిజం చేశారు. షమీ తండ్రి కూడా ఫాస్ట్ బౌలర్ కావాలని కలలు కన్నారట. కానీ, కుటుంబ పరిస్థితుల వల్ల కుదర్లేదట. అందుకే షమీకి క్రికెట్ లో శిక్షణ ఇప్పించారు. ఒకసారి నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు షమీ వేసిన రెండు బౌన్సర్లకు సౌరవ్ గంగూలీ షాకయ్యారు. ఆ బౌన్సర్ షమీ లైఫ్ ను మార్చింది. షమీలోని ట్యాలెంట్ చూసి గంగూలీ వెస్ట్ బెంగాల్ టీంకు సిఫార్సుతో చేశాడు. దాంతో షమీకి చోటు మార్గం ఈజీ అయింది. దేశవాళీలో సత్తా చాటిన షమీ.. ఆ తర్వాత టీమిండియాలో ఎంట్రీ ఇచ్చారు.
లైఫ్ మారిపోతుంది అనుకున్న టైంలో.. షమీ కష్టాలు మొదలయ్యాయి. ఆరేళ్ల క్రితం తనకు క్రికెట్ ఓనమాలు నేర్పిన తండ్రిని కోల్పోయాడు. జీవితాంతం తోడుగా ఉంటుందనుకునే భార్య విడాకులు తీసుకుంది. తనపై అత్యాచారం చేస్తున్నాడని గృహ హింస చట్టంకింద కేసు పెట్టి కోర్టుకు లాగింది. పాకిస్తాన్ తో మ్యాచ్ ఫిక్సింగ్ చేశాడని ఆరోపణలు ఎదుర్కొన్నాడు. తర్వాత తన కూతురు అనారోగ్యం పాలైంది. ఇవన్నీ చాలవన్నట్లు యాక్సిడెంట్ అయింది. ఇవేవీ షమీని ఆపలేదు. ఏ కష్టానికి షమీ తలొగ్గలేదు. కుంగిపోలేదు. సంక్షోభాల్లో అవకాశాలను వినియోగించుకుంటూ ఎందరికో స్ఫూర్తిగా మారారు. ఇప్పుడు జట్టుకు కీలక విజయాల్ని అందించి తన తండ్రి కలను నిజం చేస్తున్నాడు.
షమీ ఊరిలో స్టేడియం:
తన ప్రతిభకు, సేవకు గుర్తింపుగా షమీకి యూపీ ప్రభుత్వం గిఫ్ట్ ఇస్తుంది. షమీ స్వగ్రామం సహస్పూర్ అలీనగర్లో మినీ స్టేడియం నిర్మిస్తుంది. ఎన్నో కష్టాలు పడి, ఎటువంటి సాయం లేకపోయినా తన వ్యవసాయ క్షేత్రంలోనే ప్రాక్టీస్ చేసిన షమీకి గుర్తుగా ఈ మినీ స్టేడియాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పుడు మినీ స్టేడియం రానుండటంతో షమీలాంటి మరింతమంది మెరికల్లాంటి యువత వెలుగులోకి వస్తారని క్రీడాభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.