ఎవరికీ అందనంత ఎత్తులో టీమిండియా.. సరికొత్త రికార్డ్ నమోదు
X
సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ ను సొంతం చేసుకుంది. బ్యాటింగ్ లో రింకూ సింగ్, జితేశ్ శర్మ మెరవగా.. స్పిన్ తో అక్షర్ పటేల్, రవీ బిష్ణోయ్ కట్టడిచేయడంతో 20 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. ఈ విజయంతో టీ20ల్లో అత్యధిక విజయాలు నమోదుచేసిన జట్టుగా అవతరించింది. పాకిస్తాన్ రికార్డ్ బద్దలుకొట్టింది. 2006 నుంచి ఇప్పటివరకు ఆడిన టీ20ల్లో భారత్ 136 మ్యాచుల్లో విజయం సాధించింది. 67 మ్యాచుల్లో ఓడిపోయింది. ఒకటి టైగా ముగియగా.. మూడిట్లో ఎలాంటి ఫలితం తేలలేదు. కాగా ఈ ఫార్మాట్ లో టీమిండియా విజయాల శాతం 63.84గా ఉంది.
ఇదివరకు ఈ రికార్డ్ పాకిస్తాన్ పేరిట ఉండేది. 226 మ్యాచ్ లు ఆడిన పాక్ 135 విజయాలు నమోదుచేసింది. కాగా 200 మ్యాచ్ లు ఆడిన న్యూజిలాండ్ 102 విజయాలు, 181 మ్యాచులు ఆడిన ఆస్ట్రేలియా 95 విజయాలు, 171 మ్యాచ్ లు ఆడిన సౌతాఫ్రికా 95 విజయాలను నమోదుచేసి.. ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. నాలుగో మ్యాచ్ లో 32 పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్ కొత్త రికార్డును నెలకొల్పాడు. ఈ ఫార్మాట్ లో అతివేగంగా 4 వేల పరుగులు పూర్తి చేసిన భారత ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలో కేఎల్ రాహుల్ ను అధిగమించాడు. రాహుల్ 117 ఇన్నింగ్స్ లో ఈ రికార్డ్ క్రియేట్ చేయగా.. రుతురాజ్ 116 ఇన్నింగ్స్ లోనే ఈ ఫీట్ ను అందుకున్నాడు. ఈ జాబితాలో క్రిస్‌గేల్ (107 ఇన్నింగ్స్‌లు), షాన్ మార్ష్ (113), బాబర్ అజామ్ (115), కాన్వే (116) తొలి నాలుగు స్థానాల్లో ఉన్నారు.