తడబడ్డ కుర్రాళ్లు.. పాక్ చేతిలో భారత్ ఓటమి
X
దుబాయ్ వేదికగా జరుగుతోన్న అండర్ 19 ఆసియా కప్ 2023లో టీమిండియా తడబడింది. దయాది పాకిస్తాన్ చేతిలో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. తొలి మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ పై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన కుర్రాళ్లు.. ఆదివారం (డిసెంబర్ 10) పాక్ తో జరిగిన మ్యాచ్ లో చేతులెత్తేసింది. అన్ని రంగాల్లో ఆధిపత్యం ప్రదర్శించిన పాక్ కుర్రాళ్లు.. 8 వికెట్ల తేడాతో భారత్ పై ఘన విజయం సాధించారు. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 259 పరుగులు చేసింది. ఓపెనర్ ఆదర్శ్ సింగ్ (62), కెప్టెన్ ఉదయ్ సహారన్ (60), సచిన్ దాస్ (58) అర్ధసెంచరీలతో రాణించారు.
అనంతరం, 260 పరుగుల లక్ష్యాన్ని పాకిస్థాన్ 47 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అజాన్ అవైస్(105 నాటౌట్) సెంచరీతో కదం తొక్కాడు. మరో ఎండ్ నుంచి షాజైబ్ ఖాన్ (63), సాద్ బేగ్(68 నాటౌట్).. అజాన్ అవైస్ కు చక్కటి సహకారాన్ని అందించారు. అజాన్ అవైస్- షాజైబ్ ఖాన్ జోడి రెండో వికెట్ కు ఏకంగా 110 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో పాక్ గెలుపు ఖరారయింది. టీమిండియా బౌలర్లలో హైదరాబాద్ కు చెందిన మురుగన్ అభిషేక్ 2 వికెట్లు తీశాడు. మరే ఇతర బౌలర్ వికెట్ తీయలేకపోయారు. దీంతో భారత్ ఓడిపోక తప్పలేదు. తదుపరి మ్యాచ్‌లో భారత జట్టు నేపాల్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ మంగళవారం(డిసెంబర్ 13) జరగనుంది.