భారత్పైనే ఒత్తిడెక్కువ.. సెమీస్ రికార్డులు ఏం చెప్తున్నాయంటే?
X
సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచకప్ లో భారత్ రెచ్చిపోయింది. ఫేవరెట్ గా బరిలోకి దిగి.. లీగ్ స్టేజ్ లో ఆడిన తొమ్మిది మ్యాచుల్లో గెలిచి సత్తా చాటింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో చెలరేగి సెమీస్ కు దూసుకెళ్లింది. కాగా రేపు వాంఖడే స్టేడియంలో జరిగే సెమీస్ లో న్యూజిలాండ్ తో తలపడనుంది. టోర్నీ మొత్తం చేసిన అద్భుత ప్రదర్శనను కొనసాగిస్తే సెమీస్ లో భారత్ ను ఆపడం కష్టం. అయితే గత మెగా టోర్నీల్లో చూసుకుంటే.. లీగ్ స్టేజ్ లో అదరగొట్టిన జట్టు కీలక పోరులోకి వచ్చేసరికి బోల్తా పడిపోతుంది. సెమీస్, ఫైనల్ చేరినా ఒత్తిడికి గురై చేతులెత్తేస్తున్నారు. గత 12ఏళ్లుగా టీమిండియాకు జరుగుతున్నది ఇదే. అయితే సొంత గడ్డపై జరుగుతున్న ఈ మ్యాచ్ లో అయితే నెగ్గాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
2019లో కూడా సెమీస్ లో తలపడింది న్యూజిలాండ్ తోనే. భారీ అంచనాలతో సెమీస్ లో అడుగుపెట్టిన భారత్ కు కివీస్ షాక్ ఇచ్చింది. అభిమానులకు కన్నీటిని మిగిల్చింది. ఆ మ్యాచ్ కు ప్రతీకారం తీర్చుకుని కివీస్ కు బదులుచెప్పడానికి ఇదే సరైన సమయం అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. లీగ్ లో కివీస్ ను చిత్తు చేసిన భారత్.. అదే ప్రదర్శనను సెమీస్ లో కూడా కొనసాగించాలని ఆశిస్తున్నారు. అయితే కివీస్ ను తక్కువ అంచనా వేయలేం. కీలక సమయంలో ఆ జట్టు కెప్టెన్ విలియమ్సన్ కోలుకుని రీఎంట్రీ ఇచ్చాడు. దాంతో వరుస ఓటముల్లో ఉన్న కివీస్ గెలుపు బాటపట్టింది. సెమీస్ కు అర్హత సాధించింది. కాగా భారత్ పై కివీస్ దే ఆధిపత్యం. ఆడిన నాకౌట్ మ్యాచుల్లో భారత్ కు పెద్ద రికార్డులు లేవు.
భారత్పైనే ఒత్తిడి ఎక్కువ:
రేపు వాంఖడేలో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ కీలకం కానుంది. ఎందుకంటే.. తొలుత బ్యాటింగ్ చేసిన టీంలే ఈ వేదికపై భారీ స్కోర్ చేసి గెలుస్తున్నాయి. ఇదే వరల్డ్ కప్ లో ఇంగ్లండ్ పై సౌతాఫ్రికా 399 పరుగులు చేసి.. 229 పరుగుల తేడాతో ఓడించింది. ఆ తర్వాత అదే సౌతాఫ్రికా బంగ్లాదేశ్ పై 382రన్స్ చేసి 149 రన్స్ తేడాతో గెలిచింది. శ్రీలంకపై ఇండియా 357రన్స్ చేసి, 302 రన్స్ తేడాతో గెలుపొందింది. ఈ క్రమంలో వాంఖడేలో గత రికార్డులు టీమిండియా అభిమానులను కలవరపెడుతున్నాయి. ఎందుకంటే.. వాంఖడేలో జరిగిన 2011 వరల్డ్ కప్ లో భారత్ గెలిచినా.. ఆ వేదికపై సెమీస్ మాత్రం అచ్చి రాలేదు. అదే గడ్డపై వెస్టిండీస్ తో జరిగిన 2016 టీ20 వరల్డ్ కప్ సెమీస్ మ్యాచ్ లో టీమిండియా ఓడింది. 1987లోనూ ఇదే గడ్డపై ఇండియాను ఇంగ్లండ్ ఓడించింది. దీంతో అభిమానుల్లో కొత్త గుబులు మొదలయింది. ఏం జరిగినా భారత్ గెలవాలని, ఫైనల్ చేరి కప్పు గెలవాలని ఆశిస్తున్నారు.