Home > క్రీడలు > Team India : ఇంగ్లాండ్‌ బజ్‌బాల్‌కు భారత్‌ షాక్...సిరీస్‌ను గెలుచుకున్న టీమిండియా

Team India : ఇంగ్లాండ్‌ బజ్‌బాల్‌కు భారత్‌ షాక్...సిరీస్‌ను గెలుచుకున్న టీమిండియా

Team India :  ఇంగ్లాండ్‌ బజ్‌బాల్‌కు భారత్‌ షాక్...సిరీస్‌ను గెలుచుకున్న టీమిండియా
X

టీమిండియాలో కుర్రాళ్ల హావా కొనసాగుతోంది. ఓ వైపు కింగ్ కోహ్లీ ఇంగ్లాండ్ తో సిరీస్ నుంచి తప్పుకున్నాడు. తొలి టెస్ట్ లో మంచి ఇన్నింగ్స్ ఆడిన రాహుల్ గాయంతో తర్వాత టెస్టులకు దూరమైయ్యాడు. వైఫల్యం కారణంతో శ్రేయస్ ను పక్కన పెట్టేశారు. దీంతో భారత్ కు పెద్దదిక్కుగా మిగిలింది కెప్టెన్ రోహిత్ ఒక్కడే. రజత్ పటిదార్, ధ్రువ్ జురెల్, సర్ఫరాజ్, ఆకాశ్ దీప్ కొత్త వాళ్లు. జడేజా, అశ్విన్ తప్ప మిగిత వాళ్లు అంతగా అనుభవం లేని వాళ్లే. ఇంగ్లాండ్ తో బజ్ బాల్ గెలవడం అంటే అంత ఈజీ ఏం కాదు. అయినప్పటికీ ఇంకో మ్యాచ్ ఉండగానే..కుర్రాళ్లతో కలిసి సీరిస్ ను కైవసం చేసుకుంది భారత్. రోహిత్, కోహ్లీ తర్వాత జట్టుకు, టీమిండియా భవిష్యత్తుకు ఏ ఢోకా లేదంటూ కొండంత భరోసానిచ్చింది ఈ సీరిస్.

సెన్సేషనల్ యశస్వి:

రాంఛీలో యంగ్ క్రికెటర్లు దుమ్ముదులిపేశారు. అటు బ్యాటింగ్ లోనూ..ఇటు బౌలింగ్ లోనూ అద్భుతమైన ఇన్నింగ్స్ తో సీరిస్ ను గెలిచేందుకు కీలక పాత్ర వహించారు. ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్ట్ లోనే కాదు..మూడో టెస్టులోనూ కుర్రాళ్ల విజృంభణను అంతా గమనించే ఉంటారు. దీంతో టీమిండియా భవిష్యత్‌ యువ ఆటగాళ్ల చేతుల్లో పదిలంగా ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌ లేకపోయినా ఇబ్బందేమీ లేకుండా ఈ సిరీస్ లో బ్యాటింగ్‌ ఆర్డర్ అదరగొట్టింది. ముఖ్యంగా టీమిండియా సెన్సేషనల్ క్రికెటర్ యశస్వి జైస్వాల్ తన అద్భుతమైన బ్యాటింగ్ తో రెండు డబుల్ సెంచరీలను సాధించాడు. 22 ఏళ్ల జైస్వాల్‌ ఆడింది ఏడు టెస్టులే అయినా అతడి పరిణతి చెందిన బ్యాటింగ్ గమనిస్తున్న క్రికెట్‌ దిగ్గజాలు ప్రశంసలు కురిపిస్తున్నారు. పరిస్థితిని అంచనా వేసుకుంటూ జట్టుకు విలువైన ఇన్నింగ్స్‌ను అందించే ప్రయత్నంలో జైస్వాల్‌ ఆడిన తీరుకు అందరూ ఫిదా అయ్యారు.

అందుకే ఇంగ్లండ్‌ ఓపెనర్‌ డకెట్‌ అతడిని భవిష్యత్‌ సూపర్‌స్టార్‌గా బిరుదు ఇచ్చేశాడు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చి..నేడు టీమిండియాకు ఆశాకిరణంగా చెప్పుకొనే స్థాయికి ఎదిగిన యశస్వి..భవిష్యత్తు తరం ఆటగాళ్లకూ ఆదర్శం. భారత్ సీరిస్ గెలవడంలో జైశ్వాల్ తనదైన పాత్ర వహించాడు.

సర్ఫరాజ్ మెరుపులు:

ఇక ఈ సిరీస్ లో అరగ్రేటం చేసిన మరో బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్. తొలి మ్యాచ్ లోనే హాఫ్ సెంచరీ సాధించి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. తన బ్యాటింగ్ తో ఆకట్టుకొని జట్టులో సుస్థిరంగా ఉండేందుకే వచ్చానని ఈ ముంబై బ్యాటర్ చాటుకున్నాడు. రాజ్‌కోట్‌ టెస్టులో అతడికి తుది జట్టులో చోటు దక్కగానే క్రికెట్‌ లవర్స్ చాలా ఆనంద పడ్డారు. అతడి దేశవాళీ క్రికెట్‌ ప్రతిభ అలాంటిది మరి. రాహుల్‌ గాయం రూపంలో అతడికి అదృష్టం తలుపు తట్టింది. ఎలాంటి ఒత్తిడి లేకుండా బరిలోకి దిగి రెండు ఇన్నింగ్స్‌లోనూ హాఫ్‌ సెంచరీలతో తన అరంగేట్రాన్ని ఘనంగా చాటుకున్నాడు. ఇంగ్లండ్‌ లాంటి జట్టుపై ఈ కుర్రాడు అదురూ బెదురు లేకుండా బ్యాటింగ్‌ చేసి అందరి మన్ననలు పొందాడు.

ఆకాశ్ అరగ్రేటం అదుర్స్:

టీమిండియా యువ పేసర్ ఆకాశ్ దీప్ అరంగేట్ర మ్యాచ్‌లోనే దుమ్ము రేపాడు. రాంచీ వేదికగా జరుగుతున్న ఇంగ్లాండ్ నాలుగో టెస్ట్‌‌తో భారత జట్టులోకి అడుగుపెట్టిన ఆకాశ్.. తన కెరీర్‌ను అద్భుతంగా ప్రారంభించాడు. అరగ్రేటం చేసిన ఫస్ట్ మ్యాచ్ లోనే మూడు వికెట్లు తీసి అందరి చేత ఔరా అనిపించాడు. స్టార్ పేసర్ జస్పీత్ బుమ్రాకు రెస్ట్ ఇవ్వడంతో అతని స్థానంలో అవకాశం అందుకున్న ఆకాశ్ దీప్.. తన పేస్‌తో ఇంగ్లండ్‌ను వణికించాడు. ముందు ఐపీఎల్ లో ఆర్‌సీబీ ద్వారా రెండేళ్ల క్రితం భారత క్రికెట్‌‌కు ఆకాశ్ దీప్ పరిచయమయ్యాడు. అయితే ఇప్పటి వరకు తన మార్క్ చూపించలేదు. కానీ దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణించి టీమిండియా పిలుపు అందుకున్నాడు. ముఖ్యంగా ఈ సీజన్‌లో అతను అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. అరంగేట్ర మ్యాచ్‌లోనే దూకుడుగా ఆడుతున్న ఇంగ్లండ్‌కు కళ్లెం వేసి తన బౌలింగ్ తో నెటిజన్లను ఫిదా చేశాడు.

యువ కెరటం ధ్రువ్:

ఇక టీమిండియా మరో యువ కెరటం ధ్రువ్ జురెల్. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్.. నాలుగో టెస్టులో సంచలన ఇన్నింగ్స్‌ ఆడి టీమిండియాను ఆదుకున్నాడు.

రాంచీ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్ లో అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాడు. టాప్ ఆర్డర్ విఫలమైనప్పటికీ చివరి దాక నిలకడగా ఆగి జట్టు సిరీస్ గెలిచేందుకు ముఖ్య పాత్ర వహించాడు. జట్టు క్లిష్టపరిస్థితుల్లో ఉన్నప్పుడు విలువైన పరుగులు చేసిన జురెల్‌పై ప్రశంసలు కురిపించారు మాజీలు. తన సహజసిద్ధమైన ఆటతీరునే ఆడానని అన్నాడు ధ్రువ్. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ మిస్‌ కావడంపై బాధేమీ లేదన్న ధ్రువ్‌.. తన మొదటి సిరీస్‌ ట్రోఫీని ఎత్తుకొనేందుకు తహతహలాడుతున్నానని చెప్పాడు. టెస్టుల్లో భారత్‌ తరఫున ఆడాలనేది చిన్నప్పటినుంచి కల అన్నాడు. క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గవాస్కర్‌ తనను మరో ధోనీ అంటూ పొగడడం ఆనందంగా ఉందని ధ్రువ్‌ అన్నాడు. ఏది ఏమైనప్పటికీ జట్టు విజయంలో కీలక పాత్ర వహించిన ధ్రువ్ పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

పట్టీదార్ ఇంటికే:

ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ ద్వారా తొలి సారి భారత్ తరఫున సుదీర్ఘ ఫార్మాట్‌లో అడుగుపెట్టాడు యువ బ్యాటర్ రజత్ పటీదార్. కానీ వచ్చిన అవకాశాలను చేజేతులా పోగొట్టుకున్నాడు. విరాట్ దూరం కావడంతోజట్టులో చోటు దక్కించుకున్న ఈ ప్లేయర్.. అతడి స్థానాన్ని భర్తీ చేస్తాడని అంతా భావించారు. మ్యాచుల్లో విఫలమవుతున్నా ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అతడి ప్రదర్శన ఆధారంగా వరుసగా అవకాశాలు ఇచ్చారు. అయినప్పటికీ ఈ సిరీస్‌లో 6 సార్లు బ్యాటింగ్ చేసిన ఈ మధ్యప్రదేశ్ బ్యాటర్.. 63 పరుగులు మాత్రమే చేసిప వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొవడంలో ఫేల్ అయ్యాడు. ఈ సీరిస్ లో తన ప్రదర్శన చూస్తుంటే రానున్న రోజుల్లో తన ప్లేస్ కష్టంగానే తెలుస్తోంది. ఏదీ ఏమైనప్పటీకి వచ్చిన అవకాశాన్ని మిగితా ముగ్గురు కుర్రాళ్లు ఒడిసి పట్టుకుంటే...పటీదార్ మాత్రం చేజేతులా దాన్ని నాశనం చేసుకున్నాడని అంటున్నారు క్రికెట్ లవర్స్.

యువభారత్:

అయితే కుర్రాళ్ల ఆటతీరు పై హిట్ మ్యాన్ రోహిత్, కింగ్ కోహ్లీ కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘వారు నేటితరం కుర్రాళ్లు’ అంటూ యశస్వీ జైస్వాల్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, ధ్రువ్‌ జురెల్‌లను ఉద్దేశించి కెప్టెన్‌ రోహిత్‌ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇటు రన్ మిషన్ కూడా వారిని పొగడ్తలతో ముంచేత్తాడు. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్ విజయం అద్భుతమైనదన్నాడు. అవును! మా యువ జట్టు అద్భుత సిరీస్ విజయం ఇది అంటూ ట్వీట్ చేశాడు.

అయితే ప్రస్తుతం ఏది ఏమైనప్పటికీ భారత క్రికెట్‌లో ఇప్పుడు యువ ఆటగాళ్ల హావా నడుస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సీనియర్లను కాదని కొత్త ఆటగాళ్లకే టీమిండియా సెలెక్టర్లు పెద్దపీట వేస్తున్నారు. కాబట్టి..యంగ్ క్రికెటర్స్ కూడా తమ ప్రతిభ నిరూపించుకుంటే జట్టులో వారి స్థానాలకు ఢోకా లేనట్టే.












Updated : 27 Feb 2024 6:55 AM GMT
Tags:    
Next Story
Share it
Top