IRE vs IND: అయ్యో బుమ్రా.. ఏడాది తర్వాత ఆడుతుంటే.. ఏంటిది?
X
టీమిండియా పేసు గుర్రం జస్ప్రిత్ బుమ్రా ఏడాది తర్వాత పునరాగమనానికి అంతా సిద్ధం అయింది. బుమ్రా నాయకత్వంలో కుర్రాళ్ల జట్టు ఐర్లాండ్ పర్యాటనకు వెళ్లింది. మూడు టీ20 మ్యాచుల సిరీస్ లో శుక్రవారం (ఆగస్టు18) జరగబోయే తొలి మ్యాచ్ కు రంగం సిద్ధం అయింది. డబ్లిన్‌లోని ది విలేజ్ వేదికపై సాయంత్రం 7:30 గంటలకు జరుగబోయే మ్యాచ్ ఆసక్తిగా మారనుంది. ఈ మ్యాచ్ లో ఐపీఎల్ హిట్టర్ రింకూ సింగ్ కు ఛాన్స్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. దాంతో పాటు బుమ్రా, వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ధ్ కృష్ణ గాయాల నుంచి కోలుకుని పునరాగమనం చేయబోతున్నారు. దాంతో మ్యాచ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే, ఈసారి ఫ్యాన్స్ కు నిరాశ తప్పేలా లేదని డబ్లిన్ వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం డబ్లిన్ ఆకాశమంతా మేఘావృతమై ఉంది. మ్యాచ్ జరిగే సమయానికి భారీ వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి. అక్కడి వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. దీంతో అసలు మ్యాచ్ జరుగుతుందా అన్న అనుమానం ఫ్యాన్స్ లో మొదలయింది. బుమ్రా ఎక్స్ ప్రెస్ పట్టాలెక్కుతుంటే.. ఇలా జరుగుతుందేంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆసియా కప్, వరల్డ్ కప్ కు ముందు బుమ్రా ఫిట్ నెస్ పరీక్షించడానికి ఐర్లాండ్ సిరీస్ మంచి అవకాశం అని భావించిన సెలక్టర్లకు ఏం తోచట్లేదు.