World cup 2023: కివీస్ ఓటమితో.. సెమీస్ రేసులోకి పాకిస్తాన్
X
భారత్ వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ 2023 రోజు రోజుకు ఆసక్తికరంగా మారుతుంది. ప్రతీ మ్యాచ్ రసవత్తరంగా సాగుతుంది. రోజురోజుకీ అంచనాలు తారుమారవుతున్నాయి. పాకిస్తాన్ సెమీస్ ఆశలు కోల్పోయింది అనుకున్న క్రమంలో.. తిరిగి రేసులో నిలిచింది. మ్యాచ్ మ్యాచ్ కు ఆ జట్టుకు అవకాశాలు సానుకూలంగా మారుతున్నాయి. 7 మ్యాచ్ లు ఆడిన పాక్ మూడిట్లో గెలిచి 4 మ్యాచుల్లో ఓడిపోయింది. దాంతో ఆ జట్టు సెమీస్ చేరడం దాదాపు అసాధ్యం అనుకున్నారంతా. నిన్నటి వరకు అదే అనుకుంటూ వచ్చారు. కానీ బుధవారం సౌతాఫ్రికా చేతిలో న్యూజిలాండ్ ఘోరంగా ఓడిపోయిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి. పాకిస్తాన్ సెమీస్ అవకాశాలు మరింత మెరుగయ్యాయి. అయితే ఆ జట్టు తర్వాత మ్యాచ్ లు ఇంగ్లాండ్, న్యూజిలాండ్ తో కచ్చితంగా విజయం సాధించాల్సి ఉంటుంది.
అంతేకాదు రన్ రేట్ ను మెరుగుపరుచుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం పాక్ రన్ రేట్ మైనస్ లో ఉండగా.. తర్వాత ఆడే మ్యాచ్ ల్లో భారీ విజయాలు సాధించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఆఫ్ఘనిస్తాన్ కూడా పాక్ తో సెమీస్ కు పోటీ పడుతుంది. 6 మ్యాచ్ లు ఆడిన ఆఫ్ఘన్ మూడిట్లో గెలిచింది. మరోవైపు ఇండియా, సౌతాఫ్రికా జట్లు దాదాపు సెమీస్ కు అర్హత సాధించినట్లే. ఆస్ట్రేలియాకు అవకాశం ఉన్నా.. కివీస్, పాక్, ఆఫ్ఘన్ జట్ల నుంచి గట్టి పోటీ ఉంటుంది. ఆ జట్టు కూడా మిగిలిన రెండు మ్యాచ్ లు గెలవాల్సి ఉంటుంది.