Mrinank Singh: లగ్జరీ హాటళ్లకు టోకరా వేసిన అండర్ 19 క్రికెటర్ అరెస్ట్
X
ఐపీఎల్ క్రికెటర్‌నంటూ, ఐపీఎస్ అధికారినంటూ.. మోసాలకు పాల్పడి తన బంగారు భవిష్యత్తును పాడుచేసుకున్నాడు ఓ యువ క్రికెటర్. లగ్జరీ హోటళ్లలో బస చేస్తూ.. ప్రముఖుల వద్ద నుంచి, కొంతమంది యువతుల నుంచి డబ్బు గుంజేవాడు. హోటళ్లలో బిల్లు చెల్లించకుండా అక్కడి నుంచి దర్జాగా పరారయ్యేవాడు.అతడి బాధితుల్లో టీమ్‌ఇండియా క్రికెటర్ రిషభ్ పంత్ కూడా ఉన్నాడు. చివరకు దేశం విడిచి పారిపోతుండగా ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు. విచారణలో బయటపడిన అతడి నేర చరిత చూసి పోలీసులే కంగుతిన్నారు.
హర్యానాకు చెందిన మృణాంక్ సింగ్((25) అనే వ్యక్తి గతంలో ఆ రాష్ట్ర అండర్-19 జట్టుకు ఆడాడు. ఆ తర్వాత ఆటకు స్వస్తి చెప్పి మోసాల బాటపట్టాడు. ఢిల్లీ యూనివర్సిటీ హిందూ కాలేజ్ నుంచి హ్యూమన్ రిసోర్సెస్‌లో ఎంబీఏ చేసిన మృణాంక్ సింగ్ చెడు అలవాట్లకు బానిస అవడంతో అతని తల్లిదండ్రులు కూడా వదిలేసారు. అప్పటినుంచి తప్పుడు దారుల్లో ప్రజలను మోసం చేస్తూ వారి నుంచి డబ్బులు దోచుకునేవాడు. ఒకవేళ పోలీసులకు దొరికిపోయినా తప్పించుకునేలా ఉండేందుకు కొత్త ప్లాన్లు వేసేవాడు.
2014-18 వరకు ముంబై ఇండియన్స్ టీం తరఫున ఆడానంటూ పలువురు అమ్మాయిల నుంచి లక్షల్లో డబ్బులు దోచేసాడు. అంతర్జాతీయ బ్రాండ్‌లను కూడా నమ్మబలికి భారీ మొత్తంలో డబ్బులు దండుకున్నాడు. ఆ క్రమంలోనే 2022లో మృణాంక్ ఓ వారం పాటు దిల్లీలోని ఓ ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్‌లో బస చేశాడు. తానో పాపులర్ క్రికెటర్‌నంటూ అందరికీ పరిచయం చేసుకున్నాడు. ఆ హోటల్ బిల్లు రూ.5.53 లక్షలు చెల్లించకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయాడు. బిల్లు అడిగితే తన స్పాన్సర్ కంపెనీ చెల్లిస్తుందని చెప్పాడు. అతడి మాటలు నమ్మిన హోటల్ సిబ్బంది తమ బ్యాంకు వివరాలను షేర్ చేశారు. ఆ తర్వాత రూ.2 లక్షలు బదిలీ చేసినట్లు నకిలీ లావాదేవీ వివరాలను పంపించాడు. మోసపోయామని గ్రహించిన హోటల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దీంతో గతేడాది ఆగస్టులో దిల్లీ పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. అనంతరం అతడిపై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసి లుక్‌అవుట్ సర్క్యులర్ ఇచ్చారు. ఈ క్రమంలోనే గత సోమవారం (డిసెంబరు 25) హాంకాంగ్‌కు వెళ్లేందుకు మృణాంక్ దిల్లీ ఎయిర్‌పోర్టుకు రాగా.. ఇమ్మిగ్రేషన్ అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అప్పుడు కూడా తప్పించుకోవడానికి మృణాంక్ ఒక ప్లాన్ వేసాడు. ఆ సమయంలో మరో వ్యక్తి చేత కర్ణాటక ఏడీజీ అలోక్ కుమార్‌గా ఫోన్ చేయించి.. తన కుమారుడు మృణాంక్‌ను పోలీసులు పట్టుకున్నారని వదిలేయాలని చెప్పించాడు. కానీ ఈ సారి పోలీసులు అతని మాటలు నమ్మలేదు. వెంటనే కస్టడీలోకి తీసుకున్నారు. గతంలో దిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్‌ను కూడా ఇతడు మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. లగ్జరీ ఉత్పత్తులకు సంబంధించిన వ్యాపారం చేస్తున్నానని, వాటిని తక్కువ ధరకే విక్రయిస్తానంటూ పంత్‌ను వలలో వేసుకున్నాడు. 2020-21 మధ్య అతడి నుంచి రూ.1.63 కోట్లు కొట్టేసినట్లు తెలిసింది. దీంతో గతేడాది పంత్ అతడిపై ఫిర్యాదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం పోలీసులు మృణాంక్‌ను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు.