Under-19 World Cup : నేడే అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్..ఆసీస్‌తో భారత్ ఢీ
X
అండర్-19 వరల్డ్ కప్‌లో అంతిమ సమరానికి భారత్ సిద్దమైంది. ఈ టోర్నీలో అపజయం ఎరగని భారత్ జట్టు ఆదివారం జరిగే ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. విజయాల పరంగా కూడా ఆసీస్.. భారత్ లాగే దీటైన ప్రదర్శన చేసింది. సూపర్ సిక్స్ మ్యాచ్‌లో విండీస్‌తో మ్యాచ్ వర్షంతో రద్దవగా మిగతా ఐదు మ్యాచ్‌ల్లోనూ గెలిచి ఆసీస్ అజేయంగా నిలిచింది. ఈ నేపథ్యంలో ఇరు జట్లు మధ్య ఫైనల్ మ్యాచ్ రసవత్తరంగా జరిగే అవకాశం ఉంది. భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్లో భారత్‌ను ఆస్ట్రేలియా ఓడించింది. ఇప్పుడు అండర్ 19 ప్రపంచకప్ తుది సమరంలో మరోసారి టీమిండియా-ఆస్ట్రేలియా(India vs Australia) తలపడనున్నాయి. వన్డే ప్రపంచకప్‌లో ఓటమికి యువ భారత్ ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధంగా ఉంది.
ఇప్పటికే రెండు సార్లు అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్లో కంగారులపై గెలిచిన టీమిండియా మరోసారి అదే ఫలితం పునరావృతం చేయాలని పట్టుదలగా ఉంది. ఇప్పటికే ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన భారత్.. ఆసీస్‌పై గెలిస్తే రికార్డుస్థాయిలో ఆరోసారి విశ్వవిజేతగా నిలుస్తుంది. అన్ని రంగాల్లో బలంగా ఉన్న భారత్ హాట్ ఫేవరేట్‌గా కనిపిస్తోంది. సెమీస్‌లో సౌతాఫ్రికాను చిత్తు చేసి ఫైనల్‌కు చేరుకోగా.. పాకిస్థాన్‌పై కష్టపడి గెలిచి ఆసీస్ తుది పోరుకు చేరుకుంది. ఆదివారం దక్షిణాఫ్రికాలోని బెనోని వేదిక ఫైనల్ మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. భారత్ కుర్రాళ్లు అన్ని విభాగల్లో పటిష్టంగా ఉంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో నిలకడగా రాణిస్తూ.. ప్రత్యర్థులకు చెమటలు పట్టించారు. ఫైనల్ ఫైట్ వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా అజేయంగా ఫైనల్‌కు చేరుకున్నారు. కెప్టెన్ ఉదయ్ సహారన్ జట్టును ముందుండి నడిపిస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఉదయ్‌కు తోడు సచిన్ దాస్, ముషీర్ ఖాన్ బ్యాటింగ్‌లో దుమ్ములేపుతున్నారు.