Home > క్రీడలు > IND vs ENG: ఉప్పల్లో తిరుగులేని టీమిండియా.. గణాంకాలు ఏం చెప్తున్నాయ్

IND vs ENG: ఉప్పల్లో తిరుగులేని టీమిండియా.. గణాంకాలు ఏం చెప్తున్నాయ్

IND vs ENG: ఉప్పల్లో తిరుగులేని టీమిండియా.. గణాంకాలు ఏం చెప్తున్నాయ్
X

బజ్ బాల్ ఆటతో టెస్టుల్లో దూసుకుపోతున్న ఇంగ్లాండ్ ఒకవైపు.. సంప్రదాయ టెస్ట్ క్రికెట్ ఆడుతూ ముందుకు సాగుతున్న టీమిండియా మరోవైపు. ఈ రెండు జట్ల మధ్య రేపు రసవత్తర పోరు జరగనుంది. ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్ లో భాగంగా.. రేపు (జనవరి 25) ఉప్పల్ వేదికగా తొలి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ పాయింట్స్ టేబుల్ లో వెనకబడి ఉన్న టీమిండియాకు ఈ సిరీస్ చాలా కీలకం. కాగా స్వదేశంలో జరుగుతున్న ఈ సిరీస్ పై టీమిండియా గట్టి ఫోకస్ పెట్టింది. కాగా ఉప్పల్ పిచ్ టీమిండియాకు పెట్టని కోట.. ఇక్కడ ఆడిన ఏ మ్యాచ్ లో భారత్ ఓడిపోయింది లేదు. అందుకే రేపటి మ్యాచ్ లో టీమిండియానే హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతుంది. కాగా ఉప్పల్ వేదికపై టీమిండియా గణాంకాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

2005లో ఉప్పల్ స్టేడియంలో తొలి వన్డే.. 2010లో తొలి టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఈ వేదికపై ఇప్పటివరకు ఐదు టెస్టులు ఆడిన భారత్.. నాలుగు మ్యాచుల్లో ఘన విజయం సాధించగా.. ఒక మ్యాచ్ డ్రా అయింది. 2010లో న్యూజిలాండ్ తో జరిగిన తొలి టెస్టు డ్రా కాగా.. ఈ మ్యాచ్ లో హర్భజన్ సింగ్ 111 పరుగులతో అజేయంగా నిలిచాడు. 2012లో కూడా న్యూజిలాండ్ తోనే రెండో మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ లో భారత్ 115 పరుగుల తేడాతో గెలిచింది. పుజారా 159 పరుగులు చేయగా.. అశ్విన్ 12 వికెట్లు పడగొట్టాడు. 2013లో ఆస్ట్రేలియాను ఒక ఇన్నింగ్స్, 135 పరుగుల తేడాతో చిత్తు చేసింది భారత్. ఆ మ్యాచ్ లో పుజారా 204 పరుగులు చేశాడు. 2017లో బంగ్లాదేశ్ తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్ లో భారత్ 208 పరుగుల తేడాతో గెలుపొందింది. ఆ మ్యాచ్ లో కోహ్లీ 204 పరుగులు చేసి మెరిశాడు. 2018లో వెస్టిండీస్ తో 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆ మ్యాచ్ లో పంత్ 92, రహానే 80, పృథ్వీ షా 70 సత్తా చాటారు. ఉమేశ్ యాదవ్ 10 వికెట్లు పడగొట్టాడు. కాగా ఉప్పల్ పిచ్ పై స్పిన్నర్లదే ఆధిపత్యం.

భారత్ - ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ షెడ్యూల్:

మొదటి టెస్ట్ (జనవరి 25 - జనవరి 29): హైదరాబాద్

రెండో టెస్ట్ (ఫిబ్రవరి 02 - ఫిబ్రవరి 06): విశాఖపట్నం

మూడో టెస్ట్ (ఫిబ్రవరి 15 - ఫిబ్రవరి 19) : రాజ్‌కోట్

నాలుగో టెస్ట్ (ఫిబ్రవరి 23 - ఫిబ్రవరి 27): రాంచీ

ఐదో టెస్ట్(మార్చి 7 - మార్చి 11): ధర్మశాల

Updated : 24 Jan 2024 10:02 AM GMT
Tags:    
Next Story
Share it
Top