Hanuma Vihari : ఆత్మగౌరవం దెబ్బతిన్న చోట ఉండలేను..
X
క్రీడల్లో రాజకీయాలుంటాయని తెలిసిన విషయమే. వాటిని ఎదుర్కోలేక, కెరీర్ లో ముందుకు సాగలేక ఎంతోమంది ఆటగాళ్లు తమ కెరీర్ కు గుడ్ బై చెప్పారు. తాజాగా టీమిండియా క్రికెటర్ హనుమవిహారికి కూడా ఈ చేదు అనుభవం ఎదురైంది. పాలిటిక్స్ ను భరించలేక తన కెప్టెన్సీకి, ఏపీ రంజీ టీంకు రాజీనామా చేస్తున్నట్లు హనుమవిహారి సోమవారం ప్రకటించాడు. దీంతో నిన్నటి నుంచి ఇటు క్రికెట్లో.. అటు ఏపీ రాజకీయాల్లో.. విహారి రాజీనామా గురించే చర్చంతా. దీంతో విహారికి సోషల్ మీడియా వేదికగా అభిమానులు మద్దతునిస్తున్నారు. ఒక అంతర్జాతీయ క్రీడాకారుడు.. లోకల్ పాలిటిక్స్ వల్ల ఇబ్బంది పడటం సిగ్గుచేటని మండిపడుతున్నారు.
జీవితంలో ఇంకెప్పుడూ ఆంధ్రప్రదేశ్ తరుపున రంజీ మ్యాచులు ఆడనంటూ తేల్చిచెప్పాడు విహారి. తీవ్ర అవమాన భారంతో జట్టును వదిలేస్తున్నట్లు ప్రకటించాడు. ఏడేళ్లుగా ఆంధ్రా రంజీ జట్టు కెప్టెన్ గా ఉన్న విహారి.. ఇటీవల జట్టులో 17 ప్లేయర్ గా ఉన్న పృథ్వీరాజ్ ను డ్రెస్సింగ్ రూంలో మందలించాడు. ఒక కెప్టెన్ ప్లేయర్లను మందలించడం మామూలు విషయమే. అయితే దీన్ని పర్సనల్ గా తీసుకున్న పృథ్వీరాజ్.. అదే విషయాన్ని తన తండ్రి సర్సింహా చారికి చెప్పాడు. తిరుపతి కార్పొరేటర్, పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న నర్సింహా చారి.. తన పొలిటికల్ పవర్ ను ఉపయోగించాడు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ లో ఉన్న ఓ పార్టీ నేతల అండతో విహారిపై ఒత్తిడి తేవడం మొదలుపెట్టాడు.
ఇంకేముంది ఏసీఏలో ఉన్న ఆ రాజకీయ నేతలు ముందూ వెనకా ఆలోచించకుండా.. బెంగాల్ తో మొదటి మ్యాచ్ ముగియగానే విహారిని కెప్టెన్సీ నుంచి తప్పించి రికీభుయ్ కి సారథ్యం అప్పగించింది. ఇన్నాళ్లూ అవమాన భారాన్ని పంటిబిగువున భరిస్తూ.. మ్యాచులు ఆడిన విహారి మధ్యప్రదేశ్ తో జరిగిన మ్యాచ్ ముగియగానే జట్టుకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు. ఆత్మగౌరవం దెబ్బతిన్నచోట తాను ఉండలేనని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ ఇప్పుడు జాతీయ స్థాయిలో తీవ్ర కలకలం రేపుతోంది.
ఏసీఏ సభ్యులు వారు చెప్పిందే ఆటగాళ్లు వినాలి, తమ వల్లే ప్లేయర్లంతా బతుకుతున్నారు అనుకుంటోంది. జట్టులో ఎన్ని అవమానాలు జరిగినా.. ఏనాడూ బయటికి చెప్పలేదు. జట్టుపై ఉన్న ప్రేమ గౌరవంతో ఓపికగా ఆడా. కానీ ఇప్పుడు నా ఆత్మ గౌరవం భంగ పడకూడదని జట్టుకు ఆడకూడదని నిర్ణయించుకున్నానని చెప్తూ విహారి ఎమోషనల్ అయ్యాడు. తన మనసులోని మాటను అభిమానులతో పంచుకున్నాడు. ఈ క్రమంలో ఏసీఏ మాత్రం ఈ వ్యవహారంలో విహారిపై విచారణకు సిద్ధమైంది. ప్లేయర్లతో దురుసుగా ప్రవర్తించి, అసభ్య భాషతో దూషించినందుకు విచారణ చేపడుతున్నట్లు చెప్పింది. ఏసీఏ అందరినీ ఒకేలా చూస్తుందని.. సీనియర్, జూనియర్ అంటూ ఎవరికీ ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వదని చెప్పారు.
ఈ వ్యవహారంలో విహారిదే తప్పని, అందుకే చర్యలు తీసుకున్నామని ఏసీఏ అంటుండగా.. ఆంధ్రా క్రికెటర్లంతా విహారికే మద్దతునిచ్చారు. అతన్నే కెప్టెన్ గా కొనసాగించాలంటూ ACAకు లేఖ రాశారు. ఈ విషయంలో విహారి తప్పేమి లేదని, డ్రెస్సింగ్ రూంలో పృథ్వీరాజ్ ను ఏం అనలేదని క్లారిటీ ఇచ్చారు. ఈ విషయాన్ని పృథ్వీరాజ్ పర్సనల్ గా తీసుకున్నాడు. ఆ రోజు ఏం జరిగిందో డ్రెస్సింగ్ ఉన్న ప్లేయర్లతో పాటు, సహాయ సిబ్బంది సాక్షులుగా ఉన్నామని ఆంధ్రా జట్టులోని 15 మంది ఆటగాళ్లు లేఖలో చెప్పారు.
విహారి.. ఆంధ్రా జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. ఆ జట్టు తరుపున అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అతికొద్ది మంది క్రీడాకారుల్లో విహారి ఒకడు. ఒక్కో సీజన్ గడిచేకొద్దీ జట్టు మరింత మెరుగుపడుతుంటే.. అలాంటి సమయంలో ఏసీఏ రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి విహారిని కెప్టెన్సీ నుంచి తప్పించడం ఆ జట్టు భవిష్యత్తును దెబ్బతీసే అవకాశం ఉంది. దీనిపై ఏసీఏ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.