IND vs AUS: ఈ వరల్డ్కప్ గెలవడం 12 ఏళ్ల కలనే కాదు.. 20 ఏళ్ల ప్రతీకారం కూడా
X
ఇంకొన్ని గంటల్లో వరల్డ్ కప్ ప్రారంభం కానుండగా.. అభిమానుల ఆశకు లోటు లేదు. కానీ మన జట్టు కప్పు కొడుతుందా అంటే.. ఔనని ధీమాగా చెప్పలేని పరిస్థితి. ఆటగాళ్లలో ఎన్నో సమస్యలు.. అభిమానులందరిలో ఏవేవో భయాలు. కానీ టోర్నీ మొదలై ముందుకు సాగుతున్న కొద్దీ.. ఏదో మ్యాజిక్ జరిగినట్లుగా అన్ని సమస్యలూ తొలగిపోయాయి. భయాలన్నీ ఎగిరిపోయాయి. కెప్టెన్ రోహిత్ శర్మ ఇంత నిలకడగా ఆడతాడని అనుకున్నామా? విరాట్ కోహ్లీ మళ్లీ తిరిగి ఈ స్థాయిలో పరుగుల వరద పారిస్తాడని ఊహించామా? వరల్డ్ కప్ లో ఉంటారా? ఆడతారా? అనుకున్న జస్పిత్ బుమ్రా, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ల నుంచి ఇంత మంచి ప్రదర్శన అంచనా వేశామా? బెంచ్ కే పరిమితమైన మహమ్మద్ షమీ అనుకోకుండా జట్టులోకి వచ్చి ఇంతలా రెచ్చిపోతాడని కలగన్నామా?
మొదటి మ్యాచే ఆస్ట్రేలియాతోనా.. అమ్మో అన్నారు. పాకిస్థాన్ తో తేలిక కాదన్నారు. టోర్నీలో సౌతాఫ్రికా జోరు చూసి కష్టం అనుకున్నారు. సెమీస్ లో చరిత్ర మనవైపు లేదు.. న్యూజిలాండ్‌తో ఇక కష్టమన్నారు. ఏ జట్టును వదలకుండా.. అందరినీ చిత్తు చేసిన టీమిండియా చివరికి ఫైనల్ చేరుకుంది. ఎప్పుడూ లేనంత ఆధిపత్యం.. ఎన్నడూ చూడని విజయాలు.. ఎప్పటికీ నిలిచిపోయే ప్రదర్శన చేసి సింహాల్లా ఫైనల్ లో అడుగుపెట్టింది.
దేశంలోని 150 కోట్ల మంది క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. ఇది టీమిండియా 12ఏళ్ల కలను మాత్రమే కాదు.. 20 ఏళ్ల ప్రతీకారం కూడా. 2011 ప్రపంచకప్ తర్వాత ఇప్పటి వరకు జరిగిన చాంపియన్స్ ట్రోఫీ, టీ20 వరల్డ్ కప్స్ లో టీమిండియా సెమీస్, ఫైనల్స్ చేరినా కప్పు కొట్టలేకపోయింది. ఒత్తిడిని ఎదుర్కోలేక ప్రతీసారి నిరాశపరిచింది. భారత్ కప్పు గెలవాలన్నీ కలను సొంతగడ్డపై ఈసారి నెరవేరుస్తుందని అభిమానులు విశ్వసిస్తున్నారు. సరిగ్గా 20 ఏళ్ల క్రితం 2003 వరల్డ్ కప్ లో పేలవ ఆరంభం ఇచ్చిన భారత్ తర్వాత పుంజుని ఫైనల్స్ కు చేరింది. తుది పోరులో ఆసీస్ తో తలపడి ఓడిపోయింది. దీంతో ఆ మ్యాచ్ లో ఓటమికి ఇప్పుడు బదులిచ్చే సమయం వచ్చిందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.