ICC World cup 2023: సమరానికి వేళయింది.. లైవ్ స్ట్రీమింగ్ ఎందులోనంటే?
X
క్రికెట్ అభిమానులు గంటలు లెక్కపెడుతున్నారు. స్వదేశంలో వరల్డ్ కప్ మెగా టోర్నీని వీక్షించేందుకు టైం దగ్గర పడింది. రేపటి నుంచి వరల్డ్ కప్ సమరం మొదలవనుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్రికెట్ అభిమానులు.. మిగిలిన ఈ కొన్ని గంటలు కూడా నిద్రపోలేకపోతున్నారు. సొంత మైదానంలో జరిగే ఈ టోర్నీలో భారత్ కప్పు గెలవాలని ఆశిస్తున్నారు. దేశంలో ఇప్పటికే హైప్ పెరిగిపోయింది. స్టేడియాలు ముస్తాబయ్యాయి. టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి. టికెట్ దొరకని అభిమానులు ఇంట్లో కూర్చొని లైవ్ మ్యాచ్ చూస్తారు. ఒక్కో టోర్నీ ఒక్కో ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమ్ అవుతుంది. అయితే ఈసారి వరల్డ్ కప్ ఎందులో ప్రసారం అవుతుందో తెలియక చాలామంది ఇబ్బంది పడుతున్నారు.
ఈసారి ప్రసార హక్కులను స్టార్ స్పోర్ట్ దక్కించుకుంది. స్టార్ స్పోర్ట్స్ 1, స్టార్ స్పోర్ట్స్ 1 హెచ్‌డి, స్టార్ స్పోర్ట్స్ 2, స్టార్ స్పోర్ట్స్ 3 లలో వరల్డ్ కప్ లైవ్ చూడొచ్చు. డిడి స్పోర్ట్స్ లో కూడా లైవ్ స్ట్రీమింగ్ ప్రసారమవుతుంది. డిస్నీ+ హాట్ స్టార్.. ఓటీటీ ప్రసార హక్కులను సొంతం చేసుకుంది. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు వరల్డ్ కప్ మ్యాచ్ లు జరుగుతాయి. రేపు జరగబోయే మొదటి మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. నవంబర్ 19న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. మొదటి మ్యాచ్, ఫైనల్ మ్యాచ్ లకు నరేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యం ఇస్తుంది. అక్టోబర్ 8న టీమిండియా.. ఆస్ట్రేలియాతో మొదటి మ్యాచ్ ఆడుతుంది. ప్రపంచం ఎదురుచూస్తున్న ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ అక్టోబర్ 14న జరుగుతుంది.