Home > క్రీడలు > కోహ్లీ కెప్టెన్సీలో ప్రపంచకప్ రావొద్దని ధోని కుట్ర...యువరాజ్ తండ్రి సంచలన వ్యాఖ్యలు

కోహ్లీ కెప్టెన్సీలో ప్రపంచకప్ రావొద్దని ధోని కుట్ర...యువరాజ్ తండ్రి సంచలన వ్యాఖ్యలు

కోహ్లీ కెప్టెన్సీలో ప్రపంచకప్ రావొద్దని ధోని కుట్ర...యువరాజ్ తండ్రి సంచలన వ్యాఖ్యలు
X

భారత్ దిగ్గజ క్రికెటర్, కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనిని విమర్శించే అతి కొద్ది మందిలో యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్ ఒకరు. అవకాశం దొరికినప్పుడల్లా ధోనిపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తారు. ధోని కారణంగానే యువరాజ్ కెరీర్ నాశనమైందని అప్పట్లో సంచలన విమర్శలు చేసిన యోగరాజ్ పలుమార్లు అతడిని టార్గెట్ చేశారు. తాజాగా మరోసారి ధోనిపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. 2019 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లో ఓటమికి ధోనియే కారణమని..కోహ్లీ కెప్టెన్సీలో ప్రపంచకప్ రావొద్దనే ఉద్దేశంతో భారత్‌ను ఓడగొట్టాడని విమర్శించారు. జిడ్డు బ్యాటింగ్ ఆడడంతో పాటు..కీలక సమయంలో కావాలనే రనౌట్ అయ్యాడని ఆరోపించారు.

ధోనీ చివరి ఇన్నింగ్స్‌కు నిన్నటితో నాలుగేళ్లు పూర్తవ్వగా.. యోగ్‌రాజ్ ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశాడు. 'ఇప్పటికీ నా రక్తం మరుగుతోంది. 2019 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లో ధోనీ ఉద్దేశపూర్వకంగానే సరిగ్గా బ్యాటింగ్ చేయలేదు. మరో ఎండ్‌లో సంచలన బ్యాటింగ్‌తో జడేజా చెలరేగినా... ధోనీ అతనికి సహకరించలేదు. జిడ్డు బ్యాటింగ్ చేసి ఒత్తిడితో జడేజా ఔటయ్యేలా చేశాడు. తన సామర్థ్యానికి తగ్గట్లు ఆడకుండా కావాలనే రనౌటయ్యాడు. ధోని తన బ్యాటింగ్ చేస్తే

భారత్ 48వ ఓవర్‌లోనే విజయం సాధించేది. 'అని యోగ్‌రాజ్ మండిపడ్డాడు.



తీవ్ర విమర్శలు చేసిన యోగ్‌రాజ్ సింగ్‌ను ధోని ఫ్యాన్స్ టార్గెట్ చేశారు. ట్రోలింగ్ చేస్తూ వీడియోలు, మెసేజ్ లు పెట్టారు. దీనిపై యోగ్‌రాజ్ మండిపడ్డాడు. పగలు, రాత్రి లేకుండా బుర్రలేని ధోని ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు.



అసలు ఏం జరిగింది..

2019 వన్డే ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ సారథ్యంలో భారత్ సెమీఫైనల్లో నిష్క్రమించింది. న్యూజిలాండ్ పై ఓడి ఇంటిముఖం పట్టింది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 239 పరుగులు చేసింది. అనంతరం 240 పరుగుల సాధారణ లక్ష్యంతో బరిలోకి భారత జట్టు ఆరంభంలోనే చేతులెత్తేసింది. 92 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఓటమిని ఖాయం చేసుకుంది. ఈ సమయంలో రవీంద్ర జడేజా (59 బంతుల్లో 77), మహేంద్రసింగ్‌ ధోనీ (72 బంతుల్లో 50) వీరోచితంగా పోరాడారు. ప్రధానంగా జడేజా దూకుడుగా బ్యాటింగ్ చేసి లక్ష్యాన్ని కరిగించాడు. చివరలో విజయానికి 3 ఓవర్లలో 37 పరుగులు కావాల్సి ఉన్నప్పుడు భారీ షాట్‌కు యత్నించి జడేజా ఔట్ కావడంతో మ్యాచ్ ఉత్కంఠకు చేరింది. చివరికి 10 బంతుల్లో 25 పరుగులు కావాల్సిన సమయంలో ధోనీ రనౌట్ అయ్యాడు. రెండో రన్‌ను తీసే క్రమంలో మార్టిన్ గప్టిల్ విసిరిన త్రోకు పెవిలియన్ చేరాడు. చివరకు 18 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.


Updated : 11 July 2023 10:14 PM IST
Tags:    
Next Story
Share it
Top