Yuvraj Singh : ఎంపీ ఎన్నికల్లో పోటీపై యువరాజ్ సింగ్ ఏమన్నారంటే..?
X
దేశంలో మరికొన్ని రోజుల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో గెలుపుకోసం రాజకీయ పార్టీలన్నీ తమ అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి. ఈ క్రమంలో సినీ నటులు, క్రికెటర్ల పేర్లు తెరపైకి వస్తున్నాయి. టీమిండియా మాజీ క్రికెటర్, 2011 వరల్డ్ కప్ విన్నింగ్ హీరో యువరాజ్ సింగ్ లోక్ సభ ఎన్నికల బరిలో దిగబోతున్నాడని వార్తలు వచ్చాయి. పంజాబ్లోని గురుదాస్ పూర్ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతారని ప్రచారం జరిగింది.
ఇటీవల తన తల్లితో కలిసి కేంద్రమంత్రి నితిన గడ్కరీని యువీ కలవడంతో ఈ ప్రచారం మొదలైంది. ఎట్టకేలకు ఈ ప్రచారంపై యువీ స్పందించాడు. తాను ఎన్నికల్లో పోటీ చేయడం లేదని చెప్పాడు. మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమన్నారు. యువీకెన్ ద్వారా తన సేవను కొనస్తానని చెప్పిన అతడు.. సమాజంలో మార్పును తీసుకరావడానికి శక్తి మేరకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. యువీ ప్రకటనతో ఈ పుకార్లకు చెక్ పడినట్లైంది.