World cup 2023: ధోనీ నా క్లోజ్ ఫ్రెండ్ కాదు.. అతని వ్యూహాలు నచ్చవు
X
భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, మాజీ ప్లేయర్ యువరాజ్ సింగ్ సాన్నిహిత్యం గురించి అందరికీ తెలిసిందే. క్రీజులో ఫ్రెండ్లీగా ఉంటూ.. ఎన్నో విజయాలను అందించారు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు మిడిల్, లోయర్ ఆర్డర్ లో భాగస్వామ్యం నిర్మించి గెలిపించడంలో వీళ్లిద్దరు దిట్ట. ఈ ఇద్దరి ఇన్నింగ్స్ 2011 వరల్డ్ కప్ ను టీమిండియాకు అందించింది. గ్రౌండ్ లోనే కాదు, బయటకూడా వీళ్లిద్దరు క్లోజ్ గా ఉండేవారు. కానీ, తాజాగా యువీ ఓ ఇంటర్వూలో చేసిన వ్యాఖ్యలు అభిమానుల్ని షాక్ కు గురిచేస్తున్నాయి. రణ్వీర్ షోలో పాల్గొన్న యువరాజ్ ధోనీ గురించి మాట్లాడుతూ ‘ధోనీ నేను క్లోజ్ ఫ్రెండ్స్ కాదు. మా ఇద్దరిది చాలా భిన్నమైన జీవన శైలి. క్రికెట్ కారణంగానే మేం ఫ్రెండ్స్ అంతే. అక్కడి వరకే కలిసి ఉంటాం. ఇద్దరం కలిసి దేశానికి 100 శాతం ఎఫర్ట్ ఇచ్చాము. కానీ, ధోనీ నిర్ణయాలు నాకు నచ్చవు. ధోనీ కెప్టెన్ గా, నేను వైస్ కెప్టెన్ గా చేసినప్పుడు మా ఇద్దరి నిర్ణయాలు ఒక్కోసారి కుదిరేవి కావు. కొన్నిసార్లు అతను నాకు నచ్చని నిర్ణయాలు తీసుకునేవాడ’ని యువీ చెప్పుకొచ్చాడు.
ధోనీ, యువరాజ్ సింగ్ టీమిండియాకు ఆడి 2007 టీ20 వరల్డ్ కప్ తో పాటు 2011లో వన్డే వరల్డ్ కప్ ను అందించారు. రెండు వరల్డ్ కప్స్ గెలవడంలో ధోనీది ఎంత పాత్ర ఉందో.. అంతే పాత్ర యువరాజ్ సింగ్ కు ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ ను భుజాన మోస్తూ ఎన్నో విజయాలు అందిచాడు యువీ. 2007 టీ 20 వరల్డ్ కప్ సెమీస్ లో, 2011 లో క్వార్ట్రర్ ఫైనల్లో ఆస్ట్రేలియాపై యువీ ఆడిన ఇన్నింగ్స్ లు భారత క్రికెట్ చరిత్రలో నిలిచిపోతాయి. క్యాన్సర్ తో పోరాడుతూనే 2011 వరల్డ్ కప్ లో పోరాడి జట్టుకు విజయాలను అందిచాడు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు.