AUS vs SL : ఓపెనర్లు రాణించినా.. శ్రీలంక స్వల్ప స్కోరుకే పరిమితం
X
ఇరు జట్లకు కీలక మ్యాచ్.. ఎవరు గెలిచినా.. టోర్నీలో మొదటి విజయం. దాంతో ఆస్ట్రేలియా, శ్రీలంక మధ్య జరుగుతున్న మ్యాచ్ రసవత్తరంగా మారింది. ఇరు జట్లు పట్టుదలతో బరిలోకి దిగాయి. లక్నో వేదికపై జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. క్రీజులోకి వచ్చిన లంక ఓపెనర్లు నిశంక (61, 67 బంతుల్లో), కుశాల్ పెరెరా (78, 82 బంతుల్లో) ఆసీస్ బౌలర్లను దీటుగా ఎదురుకున్నారు. 22 ఓవర్ల వరకు క్రీజులో నిలబడి 125 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో లంక భారీ స్కోర్ చేస్తుందని ఆశించారంతా.
కానీ పాట్ కమ్మిన్స్ ఈ భాగస్వామ్యానికి బ్రేక్ ఇవ్వడంతో.. శ్రీలంక పతనం ప్రారంభం అయింది. 3 ఓవర్ల గ్యాప్ లో కుశాల్ పెరెరా కూడా పెవిలియన్ చేరాడు. ఇక అప్పటి నుంచి ఏ బ్యాటర్ క్రీజులో నిల్వలేకపోయారు. ఆసీస్ బౌలర్ల దాటికి ఒక్కరొక్కరుగా పెవిలియన్ కు క్యూ కట్టారు. చరిత్ అసలంక (25) మినహా ఏ ఒక్కరు కూడా రెండంకెల స్కోర్ చేయలేకపోయారు. ఆసీస్ స్పిన్నర్ ఆడమ్ జంపా 4 వికెట్లతో లంక పతనాన్ని శాసించాడు. పాట్ కమ్మిన్స్, స్టార్క్ చెరో రెండు వికెట్లతో సత్తా చాటారు. మ్యాక్స్ వెల్ కు ఒక వికెట్ దక్కింది. దాంతో శ్రీలంక 43.3 ఓవర్లలో 209 పరుగులు చేసి కుప్పకూలింది.