Home > టెక్నాలజీ > ఆదిత్య ఎల్ 1 ప్రయోగం.. ALL THE BEST ISRO

ఆదిత్య ఎల్ 1 ప్రయోగం.. ALL THE BEST ISRO

ఆదిత్య ఎల్ 1 ప్రయోగం.. ALL THE BEST ISRO
X

మరికాసేపట్లో భారతదేశ తొలి సోలార్ మిషన్ ఆదిత్య-ఎల్ 1 నింగిలోకి ఎగరనుంది. సూర్యుడిపై పరిశోధనల కోసం తొలిసారిగా చేపడుతోన్న ఈ ప్రయోగానికి కౌంట్‌డౌన్ కొనసాగుతోంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లో శుక్రవారం మధ్యాహ్నం 12.10 గంటలకు కౌంట్ డౌన్‌ప్రారంభం కాగా.. ఈ రోజు(సెప్టెంబర్ 2)ఉదయం 11.50 గంటలకు ఆదిత్య-ఎల్‌ 1 ఉపగ్రహాన్ని మోసుకుని ‘పీఎస్‌ఎల్‌వీ సీ-57 (PSLV C-57)’ నింగిలోకి దూసుకెళ్లనుంది. భూమి నుంచి సూర్యుడి దిశగా దాదాపు 15 లక్షల కి.మీల దూరంలో ఉన్న ‘లాగ్‌రేంజ్‌ 1 (Lagrange 1 Point)’ ప్రాంతానికి చేరుకునేందుకు ఈ మిషన్‌కు 125 రోజుల సమయం పడుతుందని ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. భూమికి, సూర్యుడికి మధ్య దూరంలో ఇది కేవలం ఒక శాతం మాత్రమే.

సూర్యుడి పుట్టుక, అక్కడి పరిస్థితులను తెలుసుకునేందుకు ఇస్రో(ISRO) ఆదిత్య ఎల్‌-1 ప్రయోగం చేస్తుంది. కాగా సూర్యుడు.. భూమి మధ్య దూరం 150 మిలియన్ కిలోమీటర్లు. అయితే ఈ ప్రయోగంతో ఆదిత్య వ్యోమనౌకను భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాంగ్రేజ్‌ పాయింట్‌-1 (ఎల్‌-1) వద్ద ఉండే సుదీర్ఘమైన దీర్ఘ వృత్తాకార కక్ష్యలోకి చేరుస్తారు. సుమారు 127 రోజుల ప్రయాణం తర్వాత ఆదిత్య ఎల్‌-1 ఈ కక్ష్యలోకి చేరుతుంది. దీని వల్ల గ్రహణాలతో సంబంధం లేకుండా సూర్యుడిని నిరంతరం అధ్యయనం చేసేందుకు వీలు లభిస్తుంది. సూర్యుని వివరణాత్మక అధ్యయనాన్ని కలిగి ఉండటానికి ఈ ఉపగ్రహం 7 వేర్వేరు పేలోడ్‌లను కలిగి ఉంటుంది. 4 నాలుగు సూర్యుడి నుంచి వచ్చే కాంతిని గమనిస్తాయి. మిగిలిన 3 ప్లాస్మా, అయస్కాంత క్షేత్రాల ఇన్-సిటు పారామితులను కొలుస్తాయి. సూర్యుడికి సంబంధించి ఇది ఒక్కో నిమిషానికి ఒక్కో ఫొటో చొప్పున రోజుకు 1440 ఫొటోలు ఇస్రోకు పంపుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు.ఈ మిషన్ ప్రారంభానికి ముందు తిరుపతి జిల్లాలోని చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చీఫ్ ఎస్ సోమనాథ్ ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. “ఈరోజు(శుక్రవారం) ఆదిత్య L1 కౌంట్‌డౌన్ ప్రారంభమవుతుంది. అది శనివారం ఉదయం 11.50 గంటలకు ప్రయోగించబడుతుంది. ఆదిత్య L1 ఉపగ్రహం సూర్యుని అధ్యయనం కోసం ప్రయోగించబడుతోంది. ఎల్‌ 1 పాయింట్‌ను చేరుకోవడానికి మరో 125 రోజులు పడుతుంది. ఇది చాలా ముఖ్యమైన ప్రయోగం. చంద్రయాన్‌-4 గురించి ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. అయితే మేము దానిని త్వరలో ప్రకటిస్తాము. ఆదిత్య L1 తర్వాత, మా తదుపరి ప్రయోగం గగన్‌యాన్, ఇది అక్టోబర్ మొదటి వారంలో జరుగుతుంది” అని విలేకరులకు తెలిపారు.

Updated : 2 Sept 2023 7:52 AM IST
Tags:    
Next Story
Share it
Top