Home > టెక్నాలజీ > వారంలో సూర్యయాన్... ఆదిత్య ఎల్ 1పై ఇస్రో అప్‌డేట్

వారంలో సూర్యయాన్... ఆదిత్య ఎల్ 1పై ఇస్రో అప్‌డేట్

వారంలో సూర్యయాన్... ఆదిత్య ఎల్ 1పై ఇస్రో అప్‌డేట్
X

చంద్రయాన్ 3 ప్రాజెక్టు విజయవంతం కావడంతో ఇస్రో మరో కీలక అంతరిక్ష యాత్రకు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేస్తోంది. సూర్యుడిని అధ్యయనం చేయడానికి ఆదిత్య ఎల్ 1 (Aditya L 1) ఉపగ్రహాన్ని వచ్చే నెల 2న ప్రయోగించనుంది. అనూహ్య అవాంతరాలు ఏర్పడితే తప్ప ప్రయోగం వాయిదా పడదని సంబంధిత అధికారులు చెప్పారు. ‘‘సెప్టెంబర్ 2న (శనివారం) ఆదిత్యను ప్రయోగించే అవకాశం ఉంది. ఆదిత్యను శ్రీహరికోట లోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌కు చేర్చారు’’ అని వెల్లడించారు. ఇస్రో నమ్మినబంటు పీఎస్‌ఎల్‌వీ-సి57 వాహకనౌకను నుంచే ఈ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తారు. చందుడ్రిపై అధ్యయనం కోసం పంపిన చంద్రయాన్‌-3 ల్యాండర్, రోవర్ అనుకున్న లక్ష్యాలు సాధించడంతో ఇస్రో ‘సూర్యయాన్’ ప్రయత్నాలను ముమ్మరం చేసింది.

ఏమిటీ ప్రాజెక్ట్?

సూర్యుడి అధ్యయనానికి మన దేశం చేపడుతున్న తొలి ప్రాజెక్ట్ ఇది. ఆదిత్యుడిపై వచ్చే మార్పులను, సూర్య పదార్థాలను నిరంతం అధ్యయనం చేయడం ఆదిత్య ప్రాజెక్ట్ లక్ష్యం. శక్తిమంతమైన సూర్యకాంతిని అధ్యయనం చేస్తారు. సూర్య రేణువులను, అయస్కాంత క్షేత్రాలను విశ్లేషిస్తారు. ఎలక్ట్రో మేగ్నయిట్లు వంటి పరికరాలతో సూర్యడి వెలుపలి పొరలైన ఫోటోస్పియర్, క్రోమోస్పియర్, కరోనా(వలయం)లను అధ్యయనం చేస్తారు. యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ, ఆస్ట్రేలియా సహా పలు దేశాల అంతరిక్ష సంస్థల సాయంతో కలసి ఈ అధ్యయనం చేస్తుంది. 1,500 కిలోల బరువున్న ఆదిత్య ఎల్ 1 ఉపగ్రహాన్ని భూమి నుంచి సూర్యునివైపు 15 లక్షల కి.మీ దూరంలోని లాగ్రాంజ్‌ పాయింట్ 1 (ఎల్‌ 1) చుట్టూ ఉన్న కక్ష్యలోకి పంపుతారు. 120 రోజులు ప్రయాణించి ఈ పాయింట్ చేరుకుంటుంది.

ఉపగ్రహంలోని మొత్తం ఏడు పేలోడ్లతో ‘విజిబుల్‌ ఎమిషన్‌ లైన్‌ కొరోనాగ్రాఫ్‌ కీలకమైనది. దీని ద్వారా గ్రహణాల సమయంలోనూ సూర్యుడిని సమగ్రంగా అధ్యయనం చేయొచ్చు. సోలార్‌ అల్ట్రావైలెట్‌ ఇమేజింగ్‌ టెలిస్కోప్‌, ఆదిత్య సోలార్‌ విండ్‌ పార్టికల్‌ ఎక్స్‌పెరిమెంట్‌, ప్లాస్మా అనలైజర్‌ ప్యాకేజ్‌ ఫర్‌ ఆదిత్య, సోలార్‌ లో ఎనర్జీ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్‌, హైఎనర్జీ ఎల్‌-1 ఆర్బిటింగ్‌ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్‌, మ్యాగ్నెటోమీటర్‌ ఇతర పేలోడ్లు. 2008లో ఆదిత్య ఎల్ 1 ప్రణాళిక రూపుదిద్దుకొంది. మొదట 440 పేలోడ్లతో ప్రయోగించాలనుకున్నా తర్వాత ప్రాజెక్టును విస్తరించారు. ప్రయోగ ఖర్చుల కాకుండా దాదాపు రూ. 500 కోట్ల వరకు దీనికి కేటాయించినట్లు అంచనా.



Updated : 26 Aug 2023 4:27 PM IST
Tags:    
Next Story
Share it
Top