ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్...కట్‌చేస్తే రూ. 6.76 లక్షలు విత్ డ్రా !
X
సైబర్ క్రైమ్స్ కొత్త పుంతలు తొక్కతున్నాయి. పోలీసులు నిఘా పెట్టి ఎంత అడ్డుకట్ట వేసినా నేరగాళ్లు కొత్త పద్దతులు ద్వారా దోచేస్తున్నారు. సోషల్ మీడియా, న్యూ టెక్నాలజీతో అకౌంట్లను లూటీ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా వర్చువల్ నంబర్‌లను ఉపయోగించి జరుగుతున్న సైబర్ మోసాల పట్ల వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు, సైబర్ నిపుణులు సూచిస్తున్నా, ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ఇంకా కొందరిలో మార్పు రావడం లేదు. చదువుకున్నవారు, తెలివైన వాళ్లు సులభంగా సైబర్ నేరస్తుల వలలో పడుతున్నారు. అత్యాశకు పోయి అడ్డంగా బుక్ అవుతున్నారు. తాజాగా ఓ యువ వ్యాపారవేత్త ఐఫోన్ కోసం ఆశపడి భారీగా నష్టపోయాడు.
గుజరాలోని అహ్మదాబాద్‌లో ధన్‌ధూకా ప్రాంతానికి చెందిన యువ వ్యాపారవేత్త విరాగ్ దోషికి సైబర్ నేరగాళ్లు టోకరా వేశారు. అతడి ఇన్‌స్టాగ్రామ్‌కు ముందుగా ఓ మెసేజ్ వచ్చింది. దుబాయ్‌లోని బడే భాయ్ అండ్ చోటే భాయ్ అనే ఎలక్ట్రానిక్ స్టోర్ లక్కీడ్రాలో ఐఫోన్ 14 గెలుచుకున్నారు. రూ. మూడు వేలు చెల్లిస్తే.. ఐఫోన్ 14ను కొరియర్ చేస్తాం’’ అనేది మెసేజ్ సారాంశం. రూ. 70 వేలు ఖరీదైన ఐఫోన్ 14 కేవలం రూ. 3 వేలకే లభిస్తుందనే ఆశతో ఆ మెసేజ్‌లో ఉన్న ఫోన్ నంబర్‌కు విరాగ్ యూపీఐ ద్వారా రూ. 3 వేల నగదు చెల్లించాడు.
తర్వాత రోజు విరాగ్‌కు +92 కోడ్ ఉన్న నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. బడే భాయ్ అండ్ చోటే భాయ్ స్టోర్ నుంచి మాట్లాడుతున్నానని.. ఐఫోన్ 14తోపాటు అదనంగా స్మార్ట్‌వాచ్ కూడా పంపుతున్నట్లు కాల్ చేసిన వ్యక్తి తెలిపాడు. సూరత్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఇవి డెలివరీ అవుతాయని కూడా వివరించాడు. మరుసటి రోజు సంజయ్ శర్మ అనే వ్యక్తి నుంచి ఓఫోన్ వచ్చింది. సూరత్ ఎయిర్‌పోర్ట్‌లో డెలివరీ విభాగంలో పనిచేస్తున్నట్లు చెప్పి...విరాగ్ పేరు మీద ఓ పార్శిల్ వచ్చిందన్నాడు. ఆ పార్శిల్ కోసం రూ.8000 చెల్లించాలని కోరాడు. ఇదంతా నిజమే అని నమ్మిన విరాగ్..సంజయ్ శర్మ అకౌంట్ కు నగదు బదిలీ చేశాడు. తర్వాత అతని నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో మోసపోయినట్లు గ్రహించాడు. అనుమానం బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేయగా రూ. 6.76 లక్షల నగదు మాయమైనట్లు గుర్తించాడు. అనంతరం పోలీసులకు సంప్రదించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు.
Ahmedabad, young business man, scammers, robbed him of Rs 7 lakh, Instagram, cyber crime, using virtual numbers