Home > టెక్నాలజీ > జాబిలమ్మ ఒడిలో నిద్రపోతున్న రోవర్.. తిరిగి ఆ రోజే..

జాబిలమ్మ ఒడిలో నిద్రపోతున్న రోవర్.. తిరిగి ఆ రోజే..

జాబిలమ్మ ఒడిలో నిద్రపోతున్న రోవర్.. తిరిగి ఆ రోజే..
X

చంద్రుడిపై వెలుగు అస్తమించనుంది. కొన్ని రోజుల పాటు చీకటి అలుముకోనుంది. మళ్లీ 14 రోజుల పాటు చీకటి ఉండనుంది. ఇక జాబిల్లిపై దిగిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ తమ పనిని పూర్తి చేశాయి. చీకటి పడుతుండడంతో అవి రెస్ట్ తీసుకోవడానికి సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో రోవర్ను ఇస్రో శాస్త్రవేత్తలు స్లీప్ మోడ్లోకి పంపించారు. అందులోని పేలోడ్ లను ఆఫ్ చేశారు. త్వరలోనే ల్యాండర్ను కూడా స్లీప్ మోడ్లోకి పంపనున్నారు. దీనికి సంబంధించి ఇస్రో ట్వీట్ చేసింది.

‘‘రోవర్ తన పనులను పూర్తి చేసుకుంది. ఇప్పుడు దానిని సురక్షితంగా పార్క్ చేశాం. స్లీప్ మోడ్లో ఉంచి.. ఏపీఎక్స్ఎస్, ఎల్ఐబీఎస్ పేలోడ్లు ఆఫ్ చేశాం. ఈ పేలోడ్ల నుంచి డేటా ల్యాండర్ ద్వారా భూమికి చేరుతుంది. ప్రస్తుతం బ్యాటరీ ఫుల్ ఛార్జ్తో ఉంది. సెప్టెంబర్ 22న సూర్యోదయం అయ్యే అవకాశం ఉంది. ఈ సమయానికి సోలార్ ప్యానెల్ కాంతిని అందుకునేలా రిసీవర్ ఆన్లో ఉంచాం. రోవర్ తిరిగి యాక్టివేట్ అవుతుందని ఆశిస్తున్నాం. లేకపోతే జాబిల్లిపై భారత రాయబారిగా అది ఎప్పటికీ అక్కడే ఉంటుంది’’ అని ఇస్రో ట్వీట్ చేసింది.

చంద్రుడిపై రోవర్ ఇప్పటికే 100మీటర్లు ప్రయాణించింది. రోవర్‌ ప్రయాణించిన దూరానికి సంబంధించిన ఫొటోను ఇస్రో ట్వీట్ చేసింది. జాబిల్లిపై ప్రజ్ఞాన్‌ రోవర్‌ సెంచరీ కొట్టినట్లు ఈ ట్వీట్లో రాసుకొచ్చింది.రోవర్ పంపిన డేటాతో చంద్రుడిపై ఆక్సిజన్ ఆనవాళ్లు ఉన్నట్లు ఇస్రో గుర్తించింది. దీంతోపాటు పలు ఖనిజాలను కనుగొన్న రోవర్.. మాంగనీస్, సిలికాన్, హైడ్రోజన్, అల్యూమినియం, సల్ఫర్, కాల్షియం, ఐరన్, క్రోమియం ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించింది.

Updated : 3 Sept 2023 11:10 AM IST
Tags:    
Next Story
Share it
Top