Home > టెక్నాలజీ > భారత్‌ నుంచి తప్పుకోనున్న రియల్ మీ, వన్ ప్లస్

భారత్‌ నుంచి తప్పుకోనున్న రియల్ మీ, వన్ ప్లస్

భారత్‌ నుంచి తప్పుకోనున్న రియల్ మీ, వన్ ప్లస్
X

చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్, మొబైల్ దిగ్గజ కంపెనీలు వన్​ప్లస్​, రియల్​మీ కీలక నిర్ణయం తీసుకున్నాయి. భారత్​లో టీవీల ఉత్పత్తి, అమ్మకాలను నిలిపివేయాలని నిర్ణయించుకున్నాయని జాతీయ పత్రిక ఓ కథనంలో వెల్లడించింది. అయితే స్మార్ట్​ఫోన్ల విభాగంలో ఆ రెండు కంపెనీలు తమ వ్యాపారాన్ని కొనసాగిస్తాయని కథనంలో పేర్కొంది. అంటే ఇకపై దేశీయంగా ఆ రెండు కంపెనీలు టీవీలను తయారు చేయడం, వాటిని అమ్మడంలాంటివి చేయవు.

వన్​ప్లస్​, రియల్​మీ కంపెనీలు.. టీవీల అమ్మకాల్లో భారీ ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. పండగల సమయాల్లో డిస్కౌంట్లు, భారీ ఆఫర్లు ఇచ్చి, తక్కువ ధరలకే వినియోగదారులకు టీవీలను అందిస్తుంటాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ హాట్‌స్టార్ వంటి వాటి కారణంగా ఇటీవల కాలంలో భారత్​లో స్మార్ట్ టీవీలకు ఆదరణ పెరిగింది. అంతేగాక క్రికెట్ ప్రపంచ కప్​నకు ఆతిథ్యం ఇవ్వడం, వరుసగా పండగల సీజన్ కావడం వల్ల టీవీల అమ్మకాలు మరింత ఊపందుకున్నాయి. ఈ సమయంలో చైనా దిగ్గజ కంపెనీలు భారత్​లో టెలివిజన్ రంగంలో వ్యాపారాలు నిలిపివేయడం ఆసక్తికరంగా మారింది

భారతీయ టెలివిజన్ మార్కెట్‌లో ఎల్​జీ, శామ్​సంగ్​, సోనీ, పెనాసోనిక్​ వంటి కంపెనీలు పాపులర్ అయ్యాయి. షావోమీ , టీసీఎల్​ వంటి కంపెనీలు కూడా తమ వ్యాపారాన్ని విస్తరించి అమ్మకాల్లో మెరుగైన ఫలితాలు సాధించాయి. ఈ క్రమంలో వన్​ప్లస్​, రియల్​మీ కంపెనీల టీవీ అమ్మకాలు భారీగా పెరుగుతున్నప్పటికీ.. భారత్​లో చైనా కంపెనీలపై పెరుగుతున్న ఒత్తిడి నేపథ్యంలో అమ్మకాలు నిలిపివేయడం గమనార్హం. వన్​ప్లస్​, రియల్​మీ కంపెనీలు స్మార్ట్​ఫోన్ల వ్యాపారంలో కొనసాగుతాయని.. కానీ భారత్​లో టెలివిజన్ రంగం నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాయని సంబంధిత వ్యాపార వర్గాలు తెలిపాయి. ఈ నివేదికలపై ఆ రెండు సంస్థలు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.



Updated : 24 Oct 2023 12:05 PM IST
Tags:    
Next Story
Share it
Top