ట్విటర్ యూజర్లకు మస్క్ షాక్.. ఎవరైనాసరే డబ్బు కట్టాల్సిందే!
X
ట్విటర్ పేరు X గా మార్చి, వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపడంతో పాటు చార్జీల వసూళ్లను కూడా మొదలుపెట్టిన కంపెనీ అధినేత ఎలన్ మస్క్ మరో బాంబు పేల్చాడు. ఇకపై ఏ కేటగిరీ యూజర్లయినా సరే ఎక్స్‌ను వాడుకుంటే డబ్బు కట్టాల్సిందేనన్నారు. ఫేక్ అకౌంట్లు, ఇతర సమస్యలను నివారించడానికి ఇది తప్పనిసరి అని స్పష్టం చేశారు. చార్జీ స్వల్ప మొత్తంలో ఉంటుందన్న ఆయన ఎంత అన్నది మాత్రం చెప్పలేదు. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుతో చర్చిస్తూ మస్క్ పేమెంట్ గురించి వెల్లడించారు. ప్రస్తుతం X కు 55 కోట్ల మంది యూజర్లు ఉన్నారన్న ఆయన వారిలో ఎంత మంది నిజమైన యూజర్లో తెలియడం లేదన్నారు. కొన్ని సాంకేతిక సమస్యలను పరిష్కరించుకోవాల్సి ఉందని చెప్పారు.
ఎక్స్ ఆదాయం కొన్ని నెలలుగా తగ్గడం, యూజర్లు దాన్ని వదిలేసి ఇతర ప్రత్యామ్నాలు చూసుకోవడంతో కంపెనీ ఆదాయం తగ్గింది. ప్రకటనలు కూడా 50 శాతం తగ్గాయి. ఈ సమస్యల నుంచి గట్టెక్కడానికి పైసా వసూలుకు తెరతీస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అందరికీ చార్జీ నిబంధన పెడితే ఎంతమంది చెల్లిస్తారనేది సందేహమే. ఆసక్తి ఉన్నా నానా దేశాల్లోని యూజర్లు పేమెంట్, కరెన్సీ చేంజ్ వంటి అనే సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ట్వటర్‌లో బ్లూటిక్ యూజర్ల నుంచి మస్క్ ఇప్పటికే పైసలు వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే.