Mission Gaganyaan Success: సంబరాల్లో ఇస్రో.. గగన్యాన్ టీవీ-డీ 1 ప్రయోగం విజయవంతం
X
గగన్ యాన్ మిషన్లో కీలకమైన తొలి దశ ప్రయోగం టెస్ట్ వెహికిల్ అబార్ట్ మిషన్ (TV-D1) సక్సెస్ అయింది. మొదట కొన్ని సాంకేతిక లోపాల వల్ల ప్రయోగాన్ని నిలిపివేయగా.. దాన్ని సాల్వ్ చేసిన ఇస్రో సైంటిస్ట్ లు పరీక్షను విజయవంతం చేశారు. రోదసిలోకి సొంతగా వ్యోమగాములను పంపేందుకు భారత్ ఈ ప్రాజెక్ట్ ను ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఉదయం 10 గంటలకు సింగిల్ స్టేజ్ లిక్విడ్ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత రాకెట్ నుంచి విడిపోయిన క్రూ మాడ్యూల్.. పారాచూట్ల సాయంతో సురక్షితంగా సముద్రంలోకి దిగింది. రాకెట్ నింగిలోకి వెళ్లాక అనూహ్య పరిస్థితుల్లో ప్రయోగాన్ని రద్దు చేసుకోవల్సి వచ్చింది. దాన్ని అనుకరించిన ఇస్రో శాస్త్రవేత్తలు.. దానికోసం ‘అబార్ట్’ సంకేతాన్ని పంపించారు. దీంతో రాకెట్ పైభాగంలో క్రూ ఎస్కేప్ వ్యవస్థకు సాలిడ్ ఫ్యూయల్ మోటార్లు మండుకున్నాయి. దాదాపు 12 కిలోమీటర్ల ఎత్తులో.. క్రూ ఎస్కేప్ వ్యవస్థను రాకెట్ నుంచి వేరు చేశారు. 17 కిలోమీటర్ల ఎత్తులో క్రూ ఎస్కేప్ మాడ్యూల్, క్రూ మాడ్యూల్ పరస్పరం విడిపోయాయి.
మొదటి ప్రయోగం కొన్ని సాంకేతిక కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్లు ఇస్రో ప్రకటించింది. ఉదయం 8 గంటలకు జరగాల్సి ఉండగా.. అరగంటపాటు ఆలస్యం అయింది. వాతావరణం అనుకూలించకపోవడంతో ఉదయం 8 గంటలకు చేపట్టాల్సిన ప్రయోగాన్ని 8.30కి చేపట్టారు. మరో ఐదు సెకన్లలో టీవీ-1 వ్యోమనౌక నింగిలోకి దూసుకెళ్లాల్సి ఉండగా.. రాకెట్లో కొద్దిపాటి మంటలు వచ్చాయి. అనంతరం రాకెట్ పరీక్ష నిలిచిపోయింది. దాంతో ప్రయోగాన్ని కొద్దిసేపు హోల్డ్ లో పెట్టారు. ప్రయోగంలో ఎక్కడ ఫెల్యూర్ జరిగిందో శాస్త్రవేత్తలు గుర్తించి.. అన్నీ సరిచూసుకుని మరోసారి ప్రయోగించారు.