Chandrayaan-3 Mission :చంద్రయాన్–3 కథ ముగిసిందా..? ఇస్రో ఏమంటోంది?
X
"భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టిన చంద్రయాన్ 3 ప్రస్థానం ముగిసినట్లేనా..?" (Chandrayaan-3 mission) జాబిల్లిపై విక్రమ్ ల్యాండర్, రోవర్ల కదలికలు ఇక లేనట్లేనా? అంటే అవుననే అనిపిస్తుంది తాజా పరిస్థితి గమనిస్తుంటే. ఇస్రో శాస్త్రవేత్తలు ల్యాండర్, రోవర్లతో కనెక్ట్ అయ్యేందుకు చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా విఫలం అవుతున్నాయి. ఎంత ట్రై చేసినా వాటి నుంచి ఎలాంటి సంకేతాలు అందడం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీంతో చందమామపై వాటి ప్రస్థానం ముగిసినట్లేనన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
సెప్టెంబరు 22న చంద్రునిపై సూర్యోదయం కావడంతో చంద్రయాన్-3 మిషన్ మళ్లీ మొదలవుతుందని శాస్త్రవేత్తలు భావించారు. సూర్యకాంతితో జాబిల్లిపై నిద్రావస్తలో ఉన్న విక్రమ్ ల్యాండర్ ,ప్రజ్ఞాన్ రోవర్లు యాక్టివ్ అవుతాయని ఆశగా ఎదురుచూశారు. కానీ సూర్యోదయం ప్రారంభమై ఐదు రోజులు కావస్తున్నా వీటి నుంచి ఎలాంటి సిగ్నల్స్ రాలేదు. దీంతో గంటలు గడిచేకొద్ది అవి సంకేతాలు పంపిస్తాయనే అవకాశాలు మసకబారుతున్నాయి. దీంతో ఇక చంద్రయాన్–3 కథ ముగిసినట్లే అని అందరూ ఆశలు వదులుకుంటున్నారు. మరి ఈ విషయమై ఇస్ట్రో ఎలాంటి అనౌన్స్మెంట్ చేస్తుందో వెయిట్ చేసి చూడాల్సిందే.
"చంద్రుడి దక్షిణ ధ్రువంపైన చంద్రయాన్ -3 ప్రయోగాన్ని చేపట్టి ఇస్రో చరిత్ర సృష్టించింది". జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన మొదటి దేశంగా రికార్డు సాధించి భారత దేశ కీర్తిని ప్రపంచదేశాల్లో చాటి చెప్పింది. ఈ మిషన్‌లో భాగంగా విక్రమ్ ల్యాండర్ ఆగస్టు 23న జాబిల్లిపై సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ల్యాండర్‌లోని ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడి ఉపరితలంపైకి చేరుకుని పరిశోధనలు జరిపి విలువైన సమాచారాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు అందించింది. నిర్విరామంగా దాదాపు 14 రోజుల పాటు ఇవి రెండు చంద్రుడిపై పని చేశాయి. ఆ తర్వాత సెప్టెంబర్ 2న సూర్యాస్తమయం కావడంతో ఇవి రెండో స్లీప్ మోడ్‌లోకి వెళ్లిపోయాయి.