ఇంటర్నెట్ లేకపోయినా ఇలా యూపీఐ పేమెంట్స్ చేసేయండి..
X
ఇప్పుడు ఎక్కడ చూసినా యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారు. దేశంలో డిజిటల్ పేమెంట్స్ భారీగా పెరిగాయి. పెద్ద నోట్ల రద్దు.. అనంతరం కరోనా సమయంలో యూపీఐ పేమెంట్స్ ఊపందుకున్నాయి. చిన్న చిన్న దుకాణాల నుంచి పెద్ద పెద్ద షోరూమ్స్ వరకు ఆన్‌లైన్ పేమెంట్స్‌ను స్వీకరిస్తున్నారు. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి యాప్స్ దాదాపుగా అందరి ఫోన్లలోనూ భాగమైపోయాయి.
ఇక యూపీఐ పేమెంట్స్ చెల్లింపుల్లో కొన్ని సార్లు సమస్యలు ఉన్నాయి. వాటిలో ప్రధానంగా నెట్ సమస్య వేధిస్తోంది. కొన్నిసార్లు ఇంటర్నెట్ లేక మరికొన్ని సార్లు నెట్ సరిగా రాక వినియోగదారులు ఇబ్బందులు గురవతున్నారు. అయితే ఇకపై ఈ పరిస్థితికి చెక్ పెట్టొచ్చు. ఇంటర్నెట్ లేకున్నా.. యూపీఐ ద్వారా చెల్లింపులు చేయొచ్చు. మొబైల్ ఫోన్‌లో ఒక్క సెట్టింగ్ ద్వారా ఈ సేవలను పొందే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఈ సేవ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇంగ్లీష్, హిందీ సహా దేశంలోని 13 ప్రముఖ భాషల్లో ఇది అందుబాటులో ఉంది.
సెట్టింగ్స్ ఇలా మార్చుకోవాలి..
యూపీఐ పేమెంట్స్ చేసే మొబైల్ నంబర్ నుంచి *99# నంబర్‌కు డయల్ చేయాలి. తర్వాత నచ్చిన భాష ఎంచుకోవాలి. అనంతరం మన బ్యాంక్ పేరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనిద్వారా మీ మొబైల్ నంబర్‌కు లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్స్ లిస్ట్ కనిపిస్తుంది.ఏ అకౌంట్ నుంచి ట్రాన్సాక్షన్ జరగాలలో దానిని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ డెబిట్ కార్డు ఎక్స్‌పైరీ డేట్‌తో పాటు కార్డు నంబర్‌లోని చివరి ఆరంకెలను నమోదు చేయాలి. ఇలా చేసిన తర్వాత డబ్బులను పంపొచ్చు.
పేమెంట్స్ ఎలా చేయాలంటే..
* ఇంటర్నెట్ లేకుండా డబ్బులు పంపాలంటే.. *99# నంబర్‌కు కాల్ చేసి.. తర్వాత 1 నొక్కాలి.
*తర్వాత నగదు పంపాలనుకుంటున్న వ్యక్తి మొబైల్ నంబర్/UPI ID/ బ్యాంక్ అకౌంట్ నంబర్ ఎంటర్ చేయాలి.
*ఎంత డబ్బు పంపాలో ఎంటర్ చేసి.. తర్వాత UPI పిన్ నంబర్ ఎంటర్ చేయాలి.
*అంతే డబ్బులు విజయవంతంగా బదిలీ అవుతాయి.
*ఈ ఆప్షన్‌తో ఒకసారి రూ. 5 వేల వరకు చెల్లించొచ్చు.
*అయితే *99# సర్వీస్ వినియోగించుకుంటున్నందుకు ప్రతిసారీ 50 పైసల ఛార్జీ చేస్తారు.