Electric Vehicles : ఆ వాహనాలపై భారీ డిస్కౌంట్.. కొనేందుకు ఇదే మంచి సమయం
X
ఎలక్ట్రిక్ వాహనాలు కొనాలనుకునేవారికి శుభవార్త. ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ అయిన టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వాహనాలపై భారీ డిస్కౌంట్‌ను ప్రకటించింది. టాటా నెక్సాన్, టియాగో ఈవీ వాహనాలపై రూ.1.2 లక్షల వరకూ రాయితీని అందిస్తోంది. కార్లలో ఉపయోగించే బ్యాటరీల ధరలు భారీగా తగ్గడంతో టాటా మోటార్స్ ఈ నిర్ణయం తీసుకుంది. నెక్సాన్, టియాగో ధరలు తగ్గించినప్పటికీ ఈ మధ్యనే లాంచ్ చేసిన పంచ్ ఈవీ వాహన ధరల్లో మాత్రం ఏ మార్పులు లేవని వెల్లడించింది.
వాహనాల ధరలు తగ్గించిన తర్వాత టాటా టియాగో ఈవీ ప్రారంభ ధర రూ.7.99 లక్షలకు దిగి వచ్చింది. ఆ తర్వాత నెక్సాన్ కారు ధర రూ.14.49 లక్షలకు చేరింది. అలాగే లాంగ్ రేంజ్ నెక్సాన్ ఈవీ ప్రారంభ ధర రూ.16.99 లక్షలకు చేరుకుంది. ధరల తగ్గుదలపై టాటా ప్యాసెంజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ వివేక్ శ్రీవాస్తవ మాట్లాడారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో బ్యాటరీల ధరే కీలమని అన్నారు. బ్యాటరీల ధరలు తగ్గుముఖం పట్టడంతో వాహన ధరలను కూడా తగ్గించినట్లు తెలిపారు.