Home > టెక్నాలజీ > Chandrayaan - 3 : ఇస్రో కీలక ప్రకటన.. రోవర్ గురించి ఏం చెప్పిందంటే..

Chandrayaan - 3 : ఇస్రో కీలక ప్రకటన.. రోవర్ గురించి ఏం చెప్పిందంటే..

Chandrayaan - 3 : ఇస్రో కీలక ప్రకటన.. రోవర్ గురించి ఏం చెప్పిందంటే..
X

చంద్రయాన్ 3కు సంబంధించి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో కీలక అప్డేట్ ఇచ్చింది. చంద్రుడిపై ప్రస్తుతం నిద్రాణ స్థితిలో ఉన్న ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్ ను తిరిగి యాక్టివేట్ చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పింది. అయితే వాటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సిగ్నళ్లు రాలేదని స్పష్టం చేసింది. విక్రమ్, ప్రజ్ఞాన్తో తిరిగి సంబంధాలు పునరుద్దరించే ప్రక్రియ కొనసాగుతుందని ఇస్రో ప్రకటించింది.

అంతకు ముందు చంద్రుడిపై నిద్రాణ స్థితిలో ఉన్న విక్రమ్‌ ల్యాండర్‌, ప్రజ్ఞాన్‌ రోవర్ను మేల్కొలిపే ప్రక్రియను శనివారానికి వాయిదా వేస్తున్నట్లు ఇస్రో ప్రకటించింది. గత 14 రోజులుగా చంద్రుడిపై చీకటి కావడంతో ల్యాండర్‌, రోవర్‌ స్లీప్‌ మోడ్‌లోకి వెళ్లిపోయాయి. ప్రస్తుతం జాబిల్లిపై ఉదయం కావడంతో శుక్రవారం నుంచి ఇస్రో సైంటిస్టులు ల్యాండర్, రోవర్ తో మళ్లీ కాంటాక్ట్ లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-3 మిషన్‌ ఆగస్టు 23న విజయంతంగా సాఫ్ట్‌ ల్యాండింగ్‌ అయింది. ల్యాండర్‌ నుంచి బయటకు వచ్చిన రోవర్‌ చంద్రుని ఉపరితలంపై విజయవంతంగా ప్రయోగాలు నిర్వహించింది. 14 రోజుల పాటు అక్కడి వాతావరణ, నీటి జాడ, ఖనిజాలపై అధ్యయనం చేసి ఆ సమాచారాన్ని ఇస్రోకు చేరవేసింది.

నిజానికి చంద్రునిపై 14 రోజులు పగలు, 14 రోజులు రాత్రి ఉంటుంది. రాత్రి ఉష్ణోగ్రత దాదాపు మైనస్ 200 డిగ్రీల వరకు పడిపోతుంది. ఇలాంటి వాతావరణ పరిస్థితుల్లో పరిశోధనలు సాధ్యం కాకపోవడంతో సెప్టెంబర్ 2న రోవర్‌, సెప్టెంబర్‌ 4న ల్యాండర్‌ను స్లీప్‌ మోడ్‌లోకి పంపారు. సెప్టెంబర్ 22 శుక్రవారం చంద్రుడిపై సూర్యోదయం కావడంతో రోవర్‌పై సూర్యరశ్మి పడగానే, పరికరాలు వేడి అవుతాయని సైంటిస్టులు భావించారు. ఆ తర్వాత ల్యాండర్, రోవర్‌ నుంచి సిగ్నల్స్ వచ్చే ఛాన్సుందని వెల్లడించారు. రోవర్, ల్యాండర్‌ను నిద్రలేపి మళ్లీ క్రియాశీలకంగా మార్చితే.. చంద్రునిపై మరింత సమాచారాన్ని సేకరించవచ్చని సైంటిస్టులు భావిస్తున్నారు.

Updated : 22 Sept 2023 7:55 PM IST
Tags:    
Next Story
Share it
Top