ISRO : మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో
X
భారత అంతరిక్షపరిశోధన సంస్థ (ఇస్రో) ఖాతాలో మరో కలుకితురాయి చేరనుంది. తిరుపతి జిల్లాలోని శ్రీహరి కోట నుంచి మరో రాకెట్ ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. ఇవాళ సాయంత్రం 5.35 గంటలకు జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్14 నింగిలోకి పంపేందుకు శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేస్తున్నారు. నిన్న మధ్యాహ్నం 2.05 గంటల కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఇది నిరంతరాయంగా 27.30 గంటలపాటు కొనసాగిన తర్వాత షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్14 నింగిలోకి దూసుకెళ్లనుంది.
ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ షార్‌కు చేరుకున్నారు. కౌంట్‌డౌన్ ప్రక్రియను దగ్గరుండి పర్యవేక్షిస్తూ.. శాస్త్రవేత్తలకు పలు సూచనలు చేశారు. జీఎస్‌ఎల్‌వీ వాహకనౌక 2,275 కిలోల వెయిట్ ఉన్న ఇన్ శాట్-3డీఎస్ ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలో ప్రవేశ పెట్టనుంది. ముందస్తు సమాచారాన్ని అందుకోవడమే లక్ష్యంగా ఈ ప్రయోగాన్ని రూపొందించారు. ఈ ఉపగ్రహాన్ని వాతావరణ పరిశీలనలను మెరుగుపరచడానికి, భూమి, సముద్ర ఉపరితలాలను పర్యవేక్షించడానికి రూపొందించారు. దాంతో వాతావరణ అంచనా, విపత్తు హెచ్చరిక వ్యవస్థలను మెరుగుపరుస్తుంది. ప్రస్తుతం కక్ష్యలో ఉన్న ఇన్సాట్-3డీ, ఇన్సాట్-3డీఆర్ ఉపగ్రహాలతో కలిసి ఇది పనిచేయనుంది.