చంద్రయాన్ -3 విజయం వెనక ఆ ఆరుగురు...
X
చంద్రయాన్ -3 విజయం తర్వాత అంతరిక్ష చరిత్రలో భారతదేశం అంతర్జాతీయ శక్తిగా ఎదిగింది. ప్రపంచలోనే దక్షిణ ధృవంపై కాలుమోపిన దేశంగా భారత్ చరిత్రకెక్కింది. ఆగస్టు 23 సాయంత్రం చంద్రుడి దక్షిణ ధ్రువానికి సమీపంలో సురక్షితంగా సాఫ్ట్ ల్యాండ్ చేసి..ఇస్రో చరిత్ర సృష్టించింది. చంద్రయాన్-3 విజయానికి కారణమైన శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు చెబుతున్నారు. భారత్ సాధించిన ఈ అపురూపమైన విజయం వెనక ఆరుగురు కృషి ఉంది. వీరిని మూన్ స్టార్స్‌గా పిలుస్తున్నారు.
ఎస్.సోమనాథ్(ఇస్రో ఛైర్మన్)
ప్రస్తుతం ఇస్రో చైర్‌పర్సన్‌గా ఎస్. సోమనాథ్. ఆయన ఏరోస్పేస్ ఇంజనీర్, రాకెట్ సాంకేతిక నిపుణుడు. చంద్రయాన్ 3ని జాబిల్లి కక్షలో ప్రవేశపెట్టడానికి ఉపయోగపడిన బాహుబలి రాకెట్‌ని రూపొందించడంలో సోమనాథ్ కీలకపాత్ర వహించారు. రాకెట్‌లోకి చేర్చే ముందు చంద్రయాన్ 3ని పూర్తిగా పరీక్షించే బాధ్యతలను చూసుకున్నది సోమనాథనే. ఇస్రోలో ఎంతో సమర్థవంతమైన నాయకునిగా ఉన్న ఆయన జనవరి 2022లో, కె. శివన్ తర్వాత భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఛైర్మన్‌గా ఎంపికయ్యాడు. సోమనాథ్ బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీని డైనమిక్స్,కంట్రోల్‌లో స్పెషలైజేషన్‌తో పొందాడు.
ఉన్నికృష్ణన్ నాయర్,(విక్రమ్ సారాబాయ్ స్పేస్ సెంటర్ డైరెక్టర్)
ఉన్నికృష్ణన్ నాయర్ రాకెట్ పరిశోధనల్లో కీలక శాస్త్రవేత. అంతరిక్షంలోకి వ్యోమగామిని పంపే కార్యక్రమానికి ఏరోస్పేస్ ఇంజనీర్‌గా నాయకత్వం వహిస్తున్నాడు. హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్‌కు ఆయన మొదటి డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. గగన్‌యాన్ ప్రోగ్రామ్ కోసం అనేక క్లిష్టమైన మిషన్‌లకు నాయకత్వం వహించారు. లాంచ్ వెహికల్ మార్క్ 3 ఈయన నాయకత్వంలోనే విజయవంతమైంది. ఉన్న కృష్ణన్ నాయర్ బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ పూర్వ విద్యార్థి.
వీరముత్తువేల్: (చంద్రయాన్ 3 డైరెక్టర్)
పి వీర ముత్తు వేల్ 2019లో చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. చంద్రయాన్-3 మిషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.గత నాలుగు సంవత్సరాలుగా ఈ ప్రాజెక్టుకు తన మేధస్సును అందిస్తున్నారు. చంద్రయాన్-2, మంగళయాన్ మిషన్లలో కూడా ఆయన కీలక బాధ్యతలు నిర్వర్తించారు. తమిళనాడులోని విల్లుపురం కు చెందిన వీర ముత్తు వేల్ ఐఐటి మద్రాసులో ఇంజనీరింగ్ చేశారు.
కే. కల్పన -చంద్రయాన్ 3 డిప్యూటీ డైరెక్టర్
మరో ప్రముఖ ఇంజినీర్ కే. కల్పన. కరోనా మహమ్మారి విజృంభించిన కాలంలోనూ చంద్రయాన్-3 ప్రాజెక్టు కోసం దీక్షగా తన బృందంతో కలిసి పనిచేశారు. మన దేశానికి ఉపగ్రహాల తయారీలో తన జీవితాన్ని అంకితం చేశారు. ఆమె చంద్రయాన్-2, మంగళయాన్ మిషన్లలో కూడా పాల్గొన్నారు.
ఎం. వనిత(యూఆర్ రావు సాటిలైట్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్)బెంగళూరు
ప్రముఖ ఇంజినీర్ ఎం. వనిత చంద్రయాన్-2 మిషన్‌కు ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఎలక్ట్రానిక్స్ సిస్టమ్స్ ఇంజనీరింగ్‌లో పట్టా పొందిన ఆమె.. జాబిల్లిపై చేసిన ప్రయోగానికి నాయకత్వం వహించిన భారత మొదటి మహిళగా ఎం.వనతి చరిత్ర సృష్టించారు. చంద్రయాన్-2పై ఆమెకున్న జ్ఞానం చంద్రయాన్ 3 కోసం ఉపయోగపడింది.
ఎమ్ శంకరన్:(యూఆర్ రావు సాటిలైట్ సెంటర్ డైరెక్టర్) బెంగళూరు
2021 నుంచి యు ఆర్ రావు శాటిలైట్ సెంటర్ కి ఎమ్.శంకరన్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఇస్రో కు చెందిన అన్ని ఉపగ్రహాల డిజైనింగ్, నిర్మాణం ఈ URSC బాధ్యత.ఉపగ్రహాల తయరీలో శంకరన్ కు మూడు దశాబ్ధాలకు పైగా అనుభవం ఉంది. చంద్రయాన్-1, మంగళయాన్, చంద్రయాన్-2లకు కూడా ఈయన సేవలు అందించారు. చంద్రయాన్-3లో ఉపగ్రహం తగినంత వేడి, చల్లగా ఉండేలా చూసుకోవడం ఈయన పని. ల్యాండర్ బలాన్ని రూపొందించడంలో ఆయన సహాయం చేశారు