Home > టెక్నాలజీ > NASA : గ్రహాలపై ‘పాము’ను పంపనున్న నాసా.. మనోడే చేశాడు..

NASA : గ్రహాలపై ‘పాము’ను పంపనున్న నాసా.. మనోడే చేశాడు..

NASA : గ్రహాలపై ‘పాము’ను పంపనున్న నాసా.. మనోడే చేశాడు..
X

అంతరిక్ష టెక్నాలజీతో మనిషి అద్భుతాలు సాధిస్తున్నాడు. గ్రహాల గుట్లు విప్పుతున్నాడు. రాకెట్లు, ఉపగ్రహాలు, రోబోలతో రోదసిని లోతుగా అన్వేషిస్తున్నాడు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త పరికరాలను రూపొందిస్తూ వ్యోమ రహస్యాలను ఛేదిస్తున్నాడు. తాజాగా మనిషి మేధతో ఓ ‘మర సర్పం’ కూడా రంగంలోకి దిగనుంది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) గ్రహాలు, ఉపగ్రహాల అన్వేషణ కోసం ‘ఈల్స్’(Eels) పేరుతో దీన్ని తయారు చేసింది. భారత్‌కు చెందిన రోహన్ థాకర్ ఈ ప్రాజెక్టుకు సారథి కావడం గమనార్హం. రోహన్ థాకర్ ప్రస్తుతం నాసాలోని జెట్ ప్రొపల్షన్ లేబొరేటరీలో పనిచేస్తున్నాడు. అతడు రోహన్ నాగ్‌పూర్‌లోని విశ్వేశ్వరయ్య నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మెకానికల్ ఇంజినీరింగ్‌ పూర్తి చేశాడు.

అచ్చం పాములా పాకుతూ మెలికలు తిరగే ఈ పరికరానికి ఎక్సోబయాలజీ ఎక్స్‌టాంట్ లైఫ్ సర్వేయర్(ఈల్స్) అని పేరు పెట్టారు.శని ఉపగ్రహమైన ఎన్సిలాడస్(Saturn's moon Enceladus)పై ఉన్న మంచులో ఏముందో కనుక్కోడానికి ఈల్స్‌ను తయారు చేశారు. దీన్ని భూమితోపాటు చంద్రుడిపైకి, ఇతర గ్రహాలపైకి కూడా పంపి సమాచారం రాబట్టొచ్చని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. ఈల్స్ తను వెళ్లే మార్గంలోని ఆటంకాలను కృత్రిమే మేధతో పసిగట్టి ఆధిగమిస్తుందని చెప్పారు. ఈల్స్ పొడవు 14 అడుగులు. దీనిలో 10 భాగాల్లో 48 మోటార్లు ఉంటాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో దక్షిణ కాలిఫోర్నియాలో బెర్నార్డో మంచుకొండల్లో ఈల్స్‌ను ప్రయోగించి సత్ఫలితాలను రాబట్టారు.





‘‘ఇది ప్రస్తుతం వాడుతున్న రోబోలు, ఇతర మెషిన్లు వెళ్లలేని ప్రాంతాల్లోకి కూడా చొరబడి శోధిస్తుంది. ఇంటెలిజెన్స్ స్థాయి ఎక్కువ. రాళ్ల మధ్య పగుళ్లలో, నీటి అడుగున కూడా ఏ ఆటంకాలూ లేకుండా దూసుకెళ్తుంది. ప్రకృతి వైపరీత్యాల సమస్యలో చాలా సాయపడుతుంది’’ అని రోహన్ థాకర్ చెప్పాడు. విపత్తుల సమయంలో రెస్క్యూ, సెర్చ్ ఆపరేషన్లలో పనిచేస్తుందని తెలిపాడు. ఈల్స్‌ను అంగారకుడిపైకి కూడా పంపే ఆలోచనలో ఉన్నట్లు నాసా వెల్లడించింది.


Updated : 16 Nov 2023 8:11 PM IST
Tags:    
Next Story
Share it
Top