Lectrix EV : మార్కెట్లోకి మరో సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్లు ఇవే
X
ప్రస్తుత మార్కెట్లో ఈవీ వాహనాలకు మంచి డిమాండ్ ఉంది. పెట్రోల్ ధరలు పెరుగుతుండటంతో సామాన్యులంతా ఈవీలను కోరుకుంటున్నారు. ప్రభుత్వాలు కూడా వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈవీ వాహనాలపై సబ్సిడీలను కూడా అందిస్తూ వస్తోంది. దీంతో స్టార్టప్ కంపెనీల నుంచి టాప్ కంపెనీల వరకూ ఈవీ వాహనాలను మార్కెట్లోకి విడుదల చేస్తూ వస్తున్నారు. తాజాగా ఎస్ఏఆర్ ఎలక్ట్రిక్ మొబిలిటీలో బైక్స్ తయారీ సంస్థ అయిన లెక్ట్రిక్స్ కొత్త మోడల్‌ను విడుదల చేసింది.
ఎల్ఎక్స్ఎస్ 2.0 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లోకి రిలీజ్ చేసింది. ఈ స్కూటర్‌ను ఒకసారి చార్జ్ చేస్తే చాలు 98 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఈ స్కూటర్ ఎక్స్ షోరూమ్ ధర చూస్తే రూ.79,999గా ఉంది. ఈ కొత్త ఎల్ఎక్స్ఎస్ 2.0 స్కూటర్‌కు సంబంధించి ప్రీ బుక్సింగ్స్ మొదలయ్యాయి. స్కూటర్ డెలివరీలు మాత్రం 2024 మార్చి నుంచి ప్రారంభం అవుతాయని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ స్కూటర్ పెద్ద 3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో రానుంది.
ఈ ఈవీ స్కూటర్ 2.2 కేడబ్ల్యూ బీఎల్‌డీసీ హబ్ మోటార్ ఆధారంగా పనిచేయనుంది. స్కూటర్ గరిష్ట వేగం చూస్తే గంటకు 60 కిలోమీటర్లుగా ఉంది. 25 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ స్పేస్ ఉంది. దేశ వ్యాప్తంగా 10 వేల కంటే ఎక్కువ అమ్మకాలను చేపట్టడం లక్ష్యంగా పెట్టుకున్నామని లెక్ట్రిక్స్ ఈవీ ఎల్ఎక్స్ఎస్ సంస్థ ఎండీ, సీఈఓ కె. విజయ కుమార్ తెలిపారు.