Nokia : కథ ముగిసిందా? నోకియా ఫోన్లు కనుమరుగు కానున్నాయా..?
X
నోకియా.. ఈ పేరు ఒక ఎమోషన్.. ఒకప్పుడు దేశంలో మొబైల్ అంటే నోకియానే. ఫీచర్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు రాకముందు మార్కెట్లో నోకియాదే హవా. ఒక దశలో నోకియా 1100, 1110, 2690, ఎక్స్‌ప్రెస్ మ్యూజిక్ తదితర మోడల్ ఫోన్లు మార్కెట్‌ను ఏలాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయిందని వార్తలు వస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ల యుగంలో కాలానికి తగ్గట్లు అప్‌డేట్ కాకపోవడంతో నోకియా మొబైల్ మార్కెట్ రేసులో వెనకబడిపోయింది. ఇప్పుడు ఏకంగా నోకియా ఫోన్ కనుమరుగయ్యే పరిస్థితి వచ్చిందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
నోకియా నుంచి ఇప్పటికీ ఫీచర్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు వస్తున్నాయి. వాటన్నింటిని హెచ్ఎండీ గ్లోబల్ కంపెనీ తయారు చేస్తోంది. అయితే సదరు కంపెనీ ఇకపై ఉత్పత్తి చేసే స్మార్ట్ ఫోన్లను నోకియా బ్రాండ్పై కాకుండా హెచ్ఎండీ బ్రాండింగ్‌తోనే తీసుకురావాలని నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో ట్విట్టర్ బయోలో నోకియా.కామ్ను హెచ్ఎండీ.కామ్ అని మార్చడం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చాయి. ఒకవేళ ఈ వార్తలు నిజమైతే భవిష్యత్తులో నోకియా ఫోన్లు మార్కెట్ నుంచి కనుమరుగుకానున్నాయి.
ఇదిలా ఉంటే హెచ్ఎండీ గ్లోబల్ మాత్రం ఈ వార్తల్ని ఖండించింది. భవిష్యత్తులోనూ నోకియా ఫోన్లు మార్కెట్లోకి వస్తాయని వాటి ఉత్పత్తిని కొసాగిస్తామని చెప్పింది. కంపెనీ రీ బ్రాండింగ్ లో భాగంగానే నోకియా మొబైల్ వెబ్ సైట్ను హెచ్ఎండీకి మార్చినట్లు కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. మల్టీ బ్రాండ్ స్ట్రాటజీలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని అంటున్నారు. భవిష్యత్తులోనూ నోకియా స్మార్ట్ ఫోన్ల తయారీ కొనసాగుతుందని హెచ్ఎండీ చెప్పినా అది ఎంత వరకు ఆచరణ సాధ్యమన్నది చూడాలి. తన ఒరిజినల్ బ్రాండ్ హెచ్ఎండీ మార్కెట్ విస్తృతం చేసే ప్రయత్నాల్లో భాగంగానే ఆ కంపెనీ తమ బ్రాండ్ తో స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తోంది.
గతంలో నోకియా మైక్రోసాఫ్ట్ విండోస్ ఓఎస్‌తో పనిచేసే స్మార్ట్‌ఫోన్‌లను విక్రయించేంది. నోకియా లూమియా సిరీస్ మైక్రోసాఫ్ట్ తీసుకువచ్చిన ఫేమస్ స్మార్ట్‌ఫోన్ సిరీస్. అయితే కొన్నాళ్లుకు మైక్రోసాఫ్ట్ నోకియా బ్రాండ్‌ల హక్కులను హెచ్ఎండీ గ్లోబల్‌కు విక్రయించింది. అప్పటి నుండి హెచ్ఎండీ.. నోకియా స్మార్ట్‌ఫోన్‌లు తయారు చేస్తుంది.