రియల్ యాంకర్లకు ధీటుగా వార్తలు చదివిన ఏఐ యాంకర్..
X
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదుగుతోంది. దీనివల్ల నష్టాలు పక్కనబెడితే.. ఏఐతో ఎన్నో అద్బుతాలు ఆవిష్కృతమవుతున్నాయి. మనిషి చేసే పనులను చేస్తూ అబ్బురపరుస్తోంది. ఇప్పటివరకు మనం రియల్ యాంకర్లను మాత్రమే చూశాం.. కానీ ఇక నుంచి ఏఐ యాంకర్లను చూడబోతున్నాం. ఇప్పటికే మనదేశంలోని పలు నేషనల్ ఛానల్స్లో ఏఐ యాంకర్ న్యూస్ చదివిన సంఘటనలున్నాయి. ఇప్పుడు ఒడిశాకు చెందిన ఓ టీవీ ఛానల్ ఆ లిస్ట్లో చేరింది.
ఒడిశా టీవీ తొలిసారిగా ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషయల్ యాంకర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఏఐ యాంకర్ పేరు లిసా. చీరకట్టుతో ఉన్న లిసా.. ఒడియా, ఇంగ్లీష్ భాషల్లో వార్తలు చదివి అందరినీ ఆశ్చర్యపరించింది. ఒడిశా టీవీ స్థాపించి 25ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా భువనేశ్వర్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లిసా ప్రత్యక్షమైంది. లిసా వార్తలు చదువుతుంటే ఓ మహిళే వార్తలు చదివినట్లుగా అనిపిస్తోంది.
Meet Lisa, OTV and Odisha’s first AI news anchor set to revolutionize TV Broadcasting & Journalism#AIAnchorLisa #Lisa #Odisha #OTVNews #OTVAnchorLisa pic.twitter.com/NDm9ZAz8YW
— OTV (@otvnews) July 9, 2023
ఈ ఏఐ యాంకర్ చాలా రకాల భాషలు మాట్లాడగలదని, ప్రస్తుతం ఇంగ్లిష్, ఒడియాలో వార్తలు చదువుతోందని ఓటీవీ డిజిటల్ బిజినెస్ హెడ్ లితిషా మంగత్ పాండా తెలిపారు. ‘‘ఒడియాలో లిసాకు శిక్షణ ఇవ్వడం చాలా కష్టమైన పని. అయినప్పటికీ మేం సాధించాం. మనుషులు మాట్లాడేంత స్పష్టంగా ఉచ్చారణ లేకపోయినా.. గూగుల్ అసిస్టెంట్ కంటే మెరుగ్గానే ఉంటుంది. త్వరలోనే ఇతరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే విధంగా తయారు చేస్తాం’’ అని ఆమె తెలిపారు.
ఏఐ యాంకర్లు గడగడా వార్తలు చదువుతుండడంతో రియల్ యాంకర్ల ఉపాధికి గండి పడే అవకాశం ఉంది. పెరుగుతున్న టెక్నాలజీతో పలు రంగాల్లో ఉద్యోగుల ఉపాధిని దెబ్బతీస్తోంది. ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది. ఏఐ టెక్నాలజీతో మానవాళికి నష్టం జరగకుండా ఉండేలా నిర్ణయాలు తీసుకుంటే మంచిదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.