ఇకపై ఫోన్ పేతో ఈజీగా ఇన్కం ట్యాక్స్ కట్టేయొచ్చు..
X
ఇన్కం ట్యాక్స్ పేయర్లకు ఫోన్ పే గుడ్ న్యూస్ చెప్పింది. ఈజీగా ఇన్కం ట్యాక్స్ చెల్లించేలా కొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్తో ఇన్కం ట్యాక్స్ పోర్టల్లో లాగిన్ కాకుండానే పేమెంట్ చేసేయొచ్చు. కస్టమర్లు యూపీఐ లేదా క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్ చేయొచ్చు. ఇందుకోసం పేమేట్ సంస్థతో ఫోన్‌పే ఒప్పందం చేసుకుంది.
‘‘పన్నులు చెల్లించే ప్రక్రియ కొన్ని సార్లు సంక్లిష్టంగా ఉంటుంది. మరికొన్ని సార్లు చాలా సమయం తీసుకుంటుంది. అందుకే ఇలాంటి ఇబ్బందుల్లేని ఫీచర్‌ను తీసుకొచ్చాం. దీంతో కస్టమర్లు చాలా సులభంగా పన్నులు చెల్లించొచ్చు. మేం తీసుకొచ్చిన ఈ సదుపాయం పన్నుల చెల్లింపు ప్రక్రియలో పరివర్తన తీసుకొస్తుందని మా నమ్మకం. మా యాప్‌తో సులభంగా, సౌకర్యంగా పన్నులు చెల్లించొచ్చు’’అని ఫోన్‌పే బిల్ పేమెంట్స్ అండ్ రీఛార్జ్ బిజినెస్ హెడ్ నిహారికా తెలిపారు.
ఫోన్ పేలో ఈ ఫీచర్ ద్వారా కేవలం పన్ను మాత్రమే చెల్లించవచ్చు. ఐటీఆర్ మాత్రం ఫైల్ చేయలేరు. ఐటీఆర్ కోసం కచ్చితంగా ఇన్కం ట్యాక్స్ అధికారిక పోర్టల్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఫోన్ పేలో పేమెంట్ పూర్తైన 2రోజులకు ట్యాక్స్ చెల్లించినట్లు ఐటీ శాఖ పోర్టల్లో అప్డేట్ అవుతుంది. అదే విధంగా ట్యాక్స్ చెల్లించిన తర్వాత 24 గంటల్లో యూజర్లకు అక్నాలెడ్జ్మెంట్ వస్తుంది.