ముకేష్ అంబానీ నయా ప్లాన్..కొత్తగా ఎయిర్‌ఫైబర్ లాంఛ్..
X
జియో సంస్థ వినాయక చవితికి తన కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. సరికొత్తగా ఫైబర్ కేబుల్ అవసరం లేకుండా జియో ఎయిర్ ఫైబర్‌ను లాంచ్ చేయబోతోంది. రిలయన్స్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ తాజాగా ఈ విషయాన్నివెల్లడించారు. సెప్టెంబర్ 19న ఈ సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నాట్లు ప్రకటించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ 46వ ఆన్యువల్ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ సంస్థ గత పదేళ్లలో 150 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్స్ చేసినట్లు చెప్పారు. వినాయక చవితి పండుగ రోజు జియో ఎయిర్‌ఫైబర్ లాంఛింగ్ జరుగనుంది.
దేశవ్యాప్తంగా 200 మిలియన్లకు పైగా ఉన్న గృహాలకు 5జీ ఇంటర్నెట్ సేవలను అందించడమే టార్గెట్ గా జియో ఎయిర్‌ఫైబర్‌ను ప్రవేశపెడుతున్నట్లు ముకేశ్ అంబానీ క్లారిటీ ఇచ్చారు. దీంతో ఇండియన్ మార్కెట్లో ఇప్పటి వరకు ఎవరూ చేయని విధంగా 5జీ సెగ్మెంట్‌ను, జియో ఎయిర్‌ఫైబర్ ద్వారా సొంతం చేసుకోవాలని రిలయన్స్ ప్లాన్ వేసింది.
ఎయిర్ ఫైబర్ స్పెషాలిటీ ఇదే ? :
ఫైబర్ లాంటి వేగంతో ఇంటర్నెట్ సేవలును అందిస్తుంది జియో ఎయిర్ ఫైబర్. అయితే ఇది పూర్తిగా వైర్ లెస్ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఇదే దీని స్పెషాలిటీ . ఎలాంటి వైర్లు లేకుండానే స్పీడ్‌గా ఇంటర్నెట్ సేవలు అందిస్తుంది. కస్టమర్లు జస్ట్ ప్లగ్ ఇన్ చేసి, స్విచ్ ఆన్ చేస్తే చాలు..వారి ఇంట్లోనే పర్సనల్ వై-ఫై హాట్‌స్పాట్ క్రియేట్ అయిపోతుంది. ఇంట్లోనే కాదు ఆఫీస్‌లోనూ జియో ఎయిర్‌ఫైబర్‌ను ఎంతో ఈజీగా ఉపయోగించుకోవచ్చు. 1 Gbps స్పీడ్‌తో ఎలాంటి ఆటంకం లేకుండా హై-స్పీడ్ ఇంటర్నెట్ను కస్టమర్లకు అందిస్తుంది. దీనితో ఏకకాలంలో స్మార్ట్‌ఫోన్స్, కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, ట్యాబ్లెట్స్, స్మార్ట్‌టీవీ, వంటి అన్ని డివైజ్‌లకు కనెక్ట్ చేసుకోవచ్చు. ఎన్ని డివైజ్‌లకు ఒకేసారి వై-ఫై కనెక్ట్ చేసినా ఇంటర్నెట్ స్పీడ్ మాత్రం ఎక్కడా తగ్గదు. అదే దీని మరో స్పెషాలిటీ.