ప్రపంచంలోనే తొలి హై వోల్టేజ్ ఈ-బైక్.. ఫీచర్లు అదుర్స్
X
ఇండియా ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి అడ్డాగా మారింది. ప్రపంచ టాప్ బ్రాండ్లు అన్నీ తమ ఉత్పత్తులను భారత్‌లో లాంచ్ చేయాలనుకుంటున్నాయి. టూవీలర్ల నుంచి ఫోర్ వీలర్ల వరకూ అత్యాధునిక ఫీచర్లతో, సరికొత్త డిజైన్లతో విడుదల అవుతున్నాయి. ఇప్పుడు సరికొత్త డిజైన్లలో రూపొందిన ఎలక్ట్రిక్ బైక్స్ యువతను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. ఈ తరుణంలో రాప్టీ ఎనర్జీ కంపెనీ ఓ ప్రత్యేక డిజైన్‌తో తొలి ఎలక్ట్రిక్ బైక్‌ను లాంచ్ చేసింది. బైక్ బాడీ మొత్తం చూస్తే పూర్తి ట్రాన్స్‌పరెంట్ లుక్‌తో కనిపిస్తుంది. అది అచ్చం గ్లాస్ తొడిగిన బైక్‌లా ఉంటుంది. ఎలక్ట్రిక్ వేరియంట్ కావడం వల్ల బండి లోపలి పార్టులు, సెట్టింగ్స్ అన్నీ బయటకు కనిపించేవిధంగా ఉంటాయి.
ట్రాన్స్‌పరెంట్ లుక్‌తో బైక్
తమిళనాడులో గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ జరిగింది. ఈ సందర్భంగా రాప్టీ తన ట్రాన్స్‌పరెంట్ బైక్‌ను ప్రదర్శించింది. ఇది ప్రపంచంలోనే తొలి హై వోల్టేజీ ఎలక్ట్రిక్ బైక్ అని రాప్టీ కంపెనీ వెల్లడించింది. చెన్నైలో 4 ఎకరాల విస్తీర్ణంలో రాప్టీ కంపెనీ తన తొలి ప్లాంట్‌ను ప్రారంభించింది. రూ.85 కోట్లతో మొదలైన ఈ కంపెనీ ప్రతి ఏటా లక్ష యూనిట్ల వరకూ బైక్‌లను ఉత్పత్తి చేయనుంది. బైక్ లోపల అన్ని పార్టులను చూడొచ్చు. అలాగే ఈ హై వోల్టేజ్ ఎలక్ట్రిక్ బైక్ స్పోర్టీ లుక్‌లో కనిపించనుంది. ఈ బైక్‌లో ఎలక్ట్రిక్ మోటార్, బ్యాటరీ మెకానిజం అంతా దిగువ భాగంలో ఉంటుంది.
అద్భుతమైన ఫీచర్లు
బైక్‌లోని బ్యాటరీని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 150 కిలోమీటర్ల వరకూ ప్రయాణించవచ్చు. గరిష్ట వేగం చూస్తే 135 కిలోమీటర్ల వేగంతో వెళ్లొచ్చు. ఈ బైక్ కేవలం 3.5 సెకన్లలోనే 0 నుంచి 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. సీసీఎస్ ఛార్జింగ్ స్టేషన్‌లో ఈ బైక్‌ను ఛార్జ్ చేసుకోవచ్చు. బ్యాటరీ 45 నిమిషాల్లోనే 80 శాతం వరకూ ఛార్జ్ అవుతుందని రాప్టీ కంపెనీ తెలిపింది. అయితే ఈ బైక్ ధర, మార్కెట్లోకి వచ్చే సమయాన్ని కంపెనీ ఇంకా వెల్లడించేదు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలోనే ఈ బైక్‌ను విడుదల చేసేందుకు రాప్టీ ఎనర్జీ కంపెనీ సన్నాహాలు చేస్తోంది. 2019 నుంచి రాప్టీ కంపెనీ ఈ బైక్‌ను తయారు చేసే పనిలో ఉంది. త్వరలోనే ఈ హై వోల్టేజీ ఎలక్ట్రిక్ బైక్ అందుబాటులోకి రానుంది.