PAYTM : పేటీఎం వాడుతున్నారా? అయితే మీకో సూచన
X
పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై ఆర్బీఐ (RBI) ఆంక్షలు విధించిన నేపథ్యంలో వ్యాపారులకు ట్రేడర్స్ సమాఖ్య కీలక సూచనలు చేసింది. లావాదేవీల కొనసాగింపు కోసం పేటీఎం బదులు వేరే చెల్లింపు యాప్‌లను వినియోగించుకోవాలని సూచించింది. ముందు జాగ్రత్తలో భాగంగా వేరే మారడం మేలని పేర్కొంది. డైరెక్ట్ యూపీఐ లేదా బ్యాంకులు స్వయంగా నిర్వహించే పేమెంట్ యాప్‌లను వాడుకోవాలని స్పష్టం చేసింది. ఆర్‌బీఐ ఆంక్షల నేపథ్యంలో పేటీఎంపై (Paytm) ఆందోళనలు రేకెత్తుతున్నాయని.. భద్రత విషయంలో చాలా మంది సందేహం వ్యక్తం చేస్తున్నారని కాయిట్ (CAIT) గుర్తుచేసింది. ఈ వేదిక అందించే ఆర్థిక సేవల కొనసాగింపుపైనా అనుమానాలు నెలకొన్నాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో నిరంతరాయ లావాదేవీలు, వాటి భద్రత కోసం పేటీఎం నుంచి ఇతర యాప్‌లకు మారడం మేలని సూచించింది.
డైరెక్ట్ యూపీఐ లావాదేవీలు, బ్యాంకులు అందించే పేమెంట్ యాప్‌లను ఉపయోగిస్తే మంచిదని చెప్పింది.వినియోగదారుల నుంచి డిపాజిట్లు స్వీకరించకుండా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (PPBL)పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ‘పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ 2024 ఫిబ్రవరి 29 తరవాత నుంచి డిపాజిట్లను స్వీకరించకూడదు. వినియోగదార్ల ఖాతాలు, ప్రీ పెయిడ్ ఇన్‌స్ట్రుమెంట్‌లు, వాలెట్‌లు, ఫాస్ట్‌ట్యాగ్‌లు, నేషనల్ కామన్ మొబిలిటీ (ఎన్‌సీఎంసీ) కార్డులు తదితరాల్లో క్రెడిట్ లావాదేవీలు లేదా టాప్‌అప్‌లు కూడా అప్పటి నుంచి చేయకూడదు’ అని ఆర్‌బీఐ వెల్లడించింది. పీపీబీఎల్ నిబంధనల ఉల్లంఘనలు, పర్యవేక్షణ లోపాలు.. ఆర్బీఐకి తెగ చికాకును తెప్పించాయని, అందుకే ఇంతటి కఠిన ఆంక్షలు వచ్చాయంటున్నారు. ఇప్పటికే కొత్త కస్టమర్లను చేర్చుకోకుండా బ్యాంక్‌పై నిషేధం ఉన్నది. 2022 మార్చి 11నే ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకున్నది. ఈ క్రమంలో తాజా నిర్ణయం పీపీబీఎల్‌కు శరాఘాతంలా పరిణమించింది. కాగా, ఎక్స్‌టర్నల్ ఆడిటర్లు ఇచ్చిన నివేదికల ఆధారంగానే రిజర్వ్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకున్నది.