Home > టెక్నాలజీ > ఇస్రోకు పోటీగా రష్యా.. 50 ఏండ్ల తర్వాత జాబిల్లిపైకి రాకెట్

ఇస్రోకు పోటీగా రష్యా.. 50 ఏండ్ల తర్వాత జాబిల్లిపైకి రాకెట్

ఇస్రోకు పోటీగా రష్యా.. 50 ఏండ్ల తర్వాత జాబిల్లిపైకి రాకెట్
X

రష్యా మళ్లీ చంద్రుడిపై పరిశోధన ప్రారంభించింది. దాదాపు 50 ఏండ్ల తర్వాత లూనా - 25 రాకెట్ ను జాబిల్లిపైకి పంపింది. మాస్కోకు తూర్పున 3,450 మైళ్ల దూరంలోని వోస్తోక్నీ కాస్మోడ్రోమ్ నుంచి శుక్రవారం తెల్లవారుజామున 2.10గంటలకు ఈ ప్రయోగం చేపట్టింది. రష్యా అంతరిక్ష పరిశోధనా సంస్థ రోస్కాస్మోస్ లూనా - 25కు సంబంధించి చిత్రాలు విడుదల చేసింది.

లూనా - 25 కేవలం 5 రోజుల్లోనే చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించనుంది. అనంతరం చంద్రుడిపై ఇప్పటి వరకు ఎవరూ చేరని దక్షిణ ధ్రువంలో 3 నుంచి 7 రోజుల్లో ల్యాండర్‌ను ల్యాండ్‌ చేయనుంది. ఈ లెక్కన ఆగస్టు 21న ల్యాండర్ చంద్రునిపై అడుగుపెట్టే అవకాశముందని సైంటిస్టులు అంటున్నారు. చంద్రుడిపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌ టెక్నాలజీస్‌ అభివృద్ధి, అక్కడి ఉపరితలంపై పరిశోధనలు, వనరుల జాడను గుర్తించేందుకు ఏడాది పాటు ఇది పనిచేయనున్నట్లు రోస్‌కాస్మోస్‌ ప్రకటించింది.





1976 తర్వాత రష్యా చేపట్టిన తొలి లూనార్‌ ల్యాండర్‌ ప్రయోగం ఇదే కావడం విశేషం. ఇప్పటి వరకు చంద్రుడి దక్షిణ ధ్రువంపై ఏ దేశ అంతరిక్ష నౌక కూడా చేరుకోలేదు. దీంతో ‘చంద్రయాన్-3’ ద్వారా సాఫ్ట్ ల్యాండింగ్ చేసి చరిత్ర సృష్టించాలని ఇస్రో భావిస్తోంది. దీనికి పోటీగా రష్యా ‘లునా -25’ ప్రయోగం చేపట్టింది. చంద్రయాన్-3 ఆగస్టు 23న ల్యాండ్ కానుండగా.. అంతకన్నా ముందే రష్యా పంపిన లూనా-25 అక్కడ అడుగుపెట్టే ఛాన్సుంది. రష్యా పంపింది కేవలం ల్యాండర్‌ మిషన్‌ కాగా.. ఇది కేవలం 30 కిలోల పేలోడ్‌ను మోసుకెళ్తోంది. లూనా - 25లో చంద్రుడిపై మట్టి సేకరించేందుకు అవసరమయ్యే రోబోటిక్‌ చేతులు, డ్రిల్లింగ్‌ హార్డ్‌వేర్‌తో పాటు ఇతర పరికరాలు ఉన్నాయి.




Updated : 11 Aug 2023 4:20 AM GMT
Tags:    
Next Story
Share it
Top