వారికి క్షమాభిక్ష.. 231 మంది ఖైదీలు విడుదల
X
గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పలువురు ఖైదీలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జైళ్లలో సత్ప్రవర్తన కలిగి ఉన్న 231 మంది ఖైదీలను ముందస్తుగా విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందులో జీవితకాల ఖైదీలు 212 మంది ఉన్నారు. అలాగే జీవితకాలం కాకుండా శిక్షను అనుభవిస్తున్నవారు మరో 19 మంది ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఖైదీలు ముందస్తు విడుదల సందర్భంగా వారి కుటుంబాల్లో ఆనందాలు వెల్లివిరిశాయి. ఈ రకంగా ఖైదీలను విడుదల చేయడం వల్ల నేరరహిత సమాజానికి మార్గం సుగమం అవుతుందని తెలంగాణ సర్కార్ భావిస్తోంది.
సాధారణంగా ప్రభుత్వం మూడు సందర్భాలల్లో ఖైదీలను ముందస్తుగా విడుదల చేస్తూ ఉంటుంది. జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా, ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా, అక్టోబర్ 2వ తేది గాంధీ జయంతి సందర్భంగా ప్రభుత్వం ఖైదీలను విడుదల చేస్తుంటుంది. అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా 2016, 2020లో కూడా రెండు సందర్భాల్లో తెలంగాణ సర్కార్ 400 మంది ఖైదీలను ముందస్తుగా విడుదల చేసింది.
అలాగే జైలు శిక్ష అనుభవిస్తున్న పలువురు ఖైదీలకు ప్రభుత్వం ఉపశమనం కలిగించనున్నట్లు తెలిపింది. పదేళ్ల కంటే ఎక్కువకాలం శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు 90 రోజుల పాటు ఉపశమనానికి అర్హులు కాగా 65 ఏళ్లు పైబడిన పురుషులు 60 రోజుల పాటు ఉపశమనం పొందొచ్చు. అదేవిధంగా ఇతర ఖైదీలకు కూడా 15 రోజుల పాటు ఉపశమనం లభిస్తుంది. అయితే కొందరు మాత్రం అనర్హులుగా ఉంటారు. మరణశిక్ష పడినవారు ముందస్తు విడుదలకు అనర్హులు. అత్యాచారం, సివిల్ దోషులు, పోక్సో చట్టం కింద శిక్షపడిన ఖైదీలకు కూడా ఉపశమనం ఉండదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువుదీరాక ఒకేసారి 231 మంది ఖైదీలను ముందస్తుగా విడుదల చేయడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.