Home > తెలంగాణ > Black Magic: తాంత్రిక పూజలకు యువకుడు బలి

Black Magic: తాంత్రిక పూజలకు యువకుడు బలి

Black Magic: తాంత్రిక పూజలకు యువకుడు బలి
X

చంద్రునిపైకి రాకెట్ పంపే స్థాయికి టెక్నాలజీ అభివృద్ధి చెందినా ప్రజల్ని మాత్రం మూఢ నమ్మకాలు ఇంకా పట్టిపీడిస్తూనే ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాలే కాదు పట్టణాల్లోనూ క్షుద్ర పూజలు, తాంత్రిక పూజలు కొనసాగుతున్నాయి. వాటిపై నమ్మకంతో జనం ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా మంచిర్యాల జిల్లాలో ఓ యువకుడు తాంత్రిక పూజల కారణంగా ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది.

చెన్నూరు పట్టణంలోని బొక్కలగూడెం కాలనీకి చెందిన మధు (33) కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కుటుంబసభ్యులు అతన్ని ఎన్ని ఆస్పత్రులకు తీసుకెళ్లినా ఆరోగ్యం కుదుటపడలేదు. దీంతో తామంటే గిట్టని వారెవరో చేతబడి చేసి ఉంటారని అనుమానించారు. నస్పూర్ ఏరియాకు చెందిన క్షుద్ర పూజరులను ఆశ్రయించారు. సదరు తాంత్రికుడు మధుకు దయ్యం పట్టిందని, ఎవరో చేతబడి చేశారని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. అతని సూచన మేరకు తాంత్రిక పూజలకు సిద్ధమయ్యారు. ఇందుకోసం ఓ మేకతో పాటు తాంత్రికుడు చెప్పిన పూజా సామాగ్రి ని కొనుగోలు చేశారు.

ఆదివారం సాయంత్రం పూజారులు మధును చెన్నూరు శివారులోని గోదావరి నదీ తీరానికి తీసుకెళ్లారు. అక్కడ ఓ చోట మధును కూర్చోబెట్టి నగ్నంగా పూజలు చేశారు. దెయ్యం వదిలించే పేరుతో అతన్ని కొట్టడంతో పాటు సాంబ్రాణి పొగ వేశారు. ఆ పొగకు గిలగిలా కొట్టుకుంటున్నా తాంత్రికులు వెనక్కితగ్గలేదు. దట్టమైన పొగ కారణంగా తీవ్ర అస్వస్థతకు గురైన మధు అక్కడే ప్రాణాలు వదిలాడు. దీంతో ఆ తాంత్రిక పూజరులు అక్కడి నుంచి పారిపోయారు. మధు కుటుంబసభ్యులు అతని మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు.

క్షుద్ర పూజలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్గా మారింది. వీడియో కాస్తా పోలీసుల దృష్టికి వెళ్లడంతో వారు రంగ ప్రవేశం చేశారు. అప్పటికే మధు మృతదేహాన్ని అంత్యక్రియలకు తరలిస్తుండగా అడ్డుకున్నారు. దీంతో మృతుని బంధువులు, పోలీసులకు మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. పోలీసులు నచ్చజెప్పడంతో చివరకు పోస్టుమార్టంకు అంగీకరించడంతో గోదావరి ఒడ్డునే ఆ ప్రక్రియ పూర్తి చేశారు. కుటుంబసభ్యులు ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కేసుగా నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated : 3 Oct 2023 7:37 AM GMT
Tags:    
Next Story
Share it
Top