Ganesh Immersion: లంబోదరుడి నిమజ్జనానికి సర్వం సిద్ధం.. 40వేల మందితో బందోబస్తు
X
"వినాయక నిమజ్జనానికి సర్వం సిద్ధమైంది". మూడు కమిషనరేట్ల పరిధిలో ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. (Ganesh Immersion) ప్రభుత్వ శాఖలతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ ఎలాంటి ఆటంకాలు లేకుండా నిమజ్జనం జరిగేలా పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనానికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి కావచ్చాయి. ఈ ఏడాది భారీ సంఖ్యలో వినాయక విగ్రహాలు తరలివచ్చే అవకాశముంది. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత కట్టుదిట్టం చేశారు.
బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర గురువారం ఉదయం ప్రారంభంకానుంది. బాలాపూర్ నుంచి హుస్సేన్ సాగర్ వరకు 19 కిలోమీటర్ల మేర శోభాయాత్ర జరగనుంది. శోభాయాత్ర జరిగే రహదారుల పొడవునా పారిశుద్ధ్య కార్యక్రమాలు, బారికేడ్లు, సూచిక బోర్డులు, సమాచార కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఇక హుస్సేన్ సాగర్ చుట్టూ 5చోట్ల నిమజ్జనం చేయనున్నారు. ఇందుకోసం 36 క్రేన్లు, జేసీబీలు, టిప్పర్లు వేలాది మంది సిబ్బందిని అందుబాటులో ఉంచారు. ఎవరైనా ప్రమాదవశాత్తు నీళ్లలో పడిపోతే వారిని రక్షించేందుకు నగరవ్యాప్తంగా 200 మంది గజ ఈతగాళ్లను నియమించారు. సాగర్ చుట్టూ, పలు రహదారులపై హెల్త్ క్యాంపులతో పాటు 79 ఫైరింజన్లు సిద్ధంగా ఉంచారు. జలమండలి ఆధ్వర్యంలో 10లక్షల నీళ్ల ప్యాకెట్లను అందుబాటులో పెట్టారు.
40 వేల మంది సిబ్బందితో అసాధారణ భద్రత
లంబోదరుడి శోభాయాత్ర , నిమజ్జనం కోసం పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు కమిషనరేట్ల పరిథిలో బందోబస్తు కోసం రికార్డు స్థాయిలో దాదాపు 40 వేల మంది పోలీసుల్ని నియమించారు. ఒక్క హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 25,694 మంది పోలీసులు విధులు నిర్వహించనున్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో మరో 6వేల మంది సేవలు అందించనున్నారు. వీరితో పాటు 125 ప్లటూన్ల అదనపు బలగాలు, ఆర్‌ఏఎఫ్, పారా మిలిటరీ బలగాలను సిద్ధంగా ఉంచారు. గణేశుడి ఉరేగింపు, నిమజ్జనం కోసం 20 వేలకుపైగా సీసీ కెమెరాలతో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించనున్నారు.