MLC Kavitha : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలి: ఎమ్మెల్సీ కవిత
X
తెలంగాణలో కులగణన చేపట్టాలని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, ఆ తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్‌లో ప్రకటించిన విధంగానే 6 నెలల్లో కులగణన చేపట్టాలన్నారు. హడావుడిగా ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహిస్తే ఊరుకోమన్నారు. బీసీల హక్కుల సాధన కోసం పోరాడుతానని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కులగణనపై కాంగ్రెస్ సర్కార్ స్పష్టమైన కార్యాచరణను ప్రకటించాలన్నారు.
బీసీల సంక్షేమం కోసం రాష్ట్ర బడ్జెట్‌లో రూ.20 వేల కోట్లు కేటాయించాలని, బీసీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించాలని కవిత డిమాండ్ చేశారు. ఎంబీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలన్నారు. అలాగే జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ పేరు పెట్టాలని కోరారు. అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ఏప్రిల్ 11వ తేది లోపు ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.
మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ మహిళలకు కోటా కల్పించాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. 2018 నుంచి ఇప్పటి వరకూ 4,365 మంది సివిల్స్ కు ఎంపిక అవ్వగా అందులో 1,195 మంది మాత్రమే బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఉన్నారన్నారు. ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు ఉన్నప్పటికీ ఆ వర్గాల నుంచి 15.5 శాతం మందినే ఎంపిక చేశారన్నారు. ఎస్సీలు 5 శాతం, ఎస్టీలు 3 శాతం మందే ఎంపికయ్యారన్నారు. రిజర్వేషన్లపై బీసీ మేధావులు నోరువిప్పాలని, న్యాయం జరిగేలా చూడాలని ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు.