జంపన్న వాగులో గల్లంతైన మృతదేహాలు లభ్యం
X
ములుగు జిల్లా వరదలో గురువారం గల్లంతైన వారిలో ఐదు మృతదేహాలు లభించాయి. ఏటూరు నాగారంలోని జంపన్న వాగు ఉగ్రరూపం దాల్చడంతో కొండాయి గ్రామం జలమయం అయ్యింది. వరద తీవ్రత అధికంగా ఉండటంతో 8 మంది గ్రామస్తులు గల్లంతయ్యారు. పెద్ద ఎత్తున వరద నీరు ఇళ్లల్లోకి చేరడంతో ప్రజలు ప్రాణాలను కాపాడుకునేందుకు ఎత్తైన ప్రదేశాలకు వెళ్లారు. ఈ క్రమంలోనే 8 మంది వాగులో పడి కొట్టుకుపోయారు. వీరిలో ఐదుగురి డెడ్ బాడీస్ మేడారం ప్రాంతంలో లభించాయి. ఇంకా మరో ముగ్గురి ఆచూకీ తెలియాల్సి ఉంది.
మరోవైపు ఎత్తైన ప్రదేశాలకు వెళ్లిన ప్రజలు తిండీ తిప్పలు లేక అలమటిస్తున్నారు. తాగేందుకు నీరు, తినేందుకు ఆహారం లేక తల్లడిల్లుతున్నారు. ప్రభుత్వం అందించే సాయం కోసం ఎదురుచూస్తున్నారు. వరద ఉద్ధృతి అధికంగా ఉండటంతో ఎన్డీఆర్ఎఫ్, డీఆర్ఎఫ్ బృందాలు కూడా అక్కడికి వెళ్లలేకపోతున్నాయి. సహాయం అందించేందుకు ఆలస్యమవుతుందని అధికారులు చెబుతున్నారు.
హన్మకొండలోని కన్నారం మత్తడివాగులో గురువారం బైక్ తో సహా గల్లంతైన 32 ఏళ్ల మహేందర్ మృతదేహం లభించింది. మరోవైపు మోరంచపల్లి వరదల్లో గల్లంతైన నలుగురి ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే మరోవైపు వరంగల్ లో మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోతగా కురుస్తున్న వానలకు పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా ఆగిపోయింది. లోతట్టుప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి.