దారుణం.. విషాహారం పెట్టి 60 కుక్కలను చంపేశారు
X
కుక్కల బెడద నుంచి తప్పించుకునేందుకు కొందరు వ్యక్తులు దారుణానికి ఒడిగట్టారు. విషాహారం పెట్టి 60 కుక్కలను చంపేశారు. ఆ తర్వాత వాటన్నంటిని గ్రామ శివారులో గొయ్యితీసి పాతి పెట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం ఆరూరు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామ పరిధిలోని కొంత మంది వ్యక్తులు.. కుక్కలకు విష ఆహారం పెట్టారని స్థానికులు తెలిపారు. కుక్కలు చనిపోయిన తర్వాత.. ట్రాక్టర్‌లో తీసుకెళ్లి ఊరి అవతల గోతి తీసి పాతి పెట్టినట్లు చెప్పారు. ఈ ఘటనపై జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో శునకాలు ఎక్కువగా ఉంటే వాటిని పట్టుకొని నిర్మానుష్య ప్రాంతంలో వదిలేయాలని కానీ, ఇలా విషాహారం పెట్టి చంపడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని పలువురు కోరుతున్నారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు నిందితులపై చర్యలు తీసుకుంటేనే.. ఇలాంటివి పునరావృతం కాకుండా ఉంటాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో కూడా రాష్ట్రంలో ఇలాంటి ఘటనలే జరిగాయి. కరీంనగర్ , మహబూబ్ నగర్ జిల్లాల్లో కొందరు వీధికుక్కలకు విషం పెట్టి చంపేశారు. ఈ మధ్య రాష్ట్రవ్యాప్తంగా కుక్కుల దాడిలో గాయపడి చనిపోతున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో వీరు తమ గ్రామంలోని కుక్కల సమస్యను నివారించడానికి తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉన్నదని కొన్ని గ్రామాల్లో కుక్కలను చంపడం మొదలుపెట్టారు. విషం పెట్టి 20 కుక్కలను చంపేసి ఆ తర్వాత ట్రాక్టర్ లో తరలించి ఖననం చేశారు. ఈ ఘటనలపై జంతు ప్రేమికులు మండిపడుతున్నారు. అంతలా సమస్య ఉంటే ఎక్కడైనా వదిలేయాలని, చంపడమేమిటని ప్రశ్నిస్తున్నారు.