Home > తెలంగాణ > గడ్డపారతో SBIలో చోరీకి ప్రయత్నించిన 7వ తరగతి విద్యార్థి

గడ్డపారతో SBIలో చోరీకి ప్రయత్నించిన 7వ తరగతి విద్యార్థి

తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో బుధవారం రాత్రి ఎస్బిఐ బ్రాంచ్ లో చోరీ జరిగింది. ఈ చోరీ విషయం తెలిసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించి, సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించగా.. అందులో ఏడో తరగతి విద్యార్థి కనిపించడం ఆశ్చర్యానికి గురి చేసింది. బుధవారం రాత్రి 8.20గంటలకు ఆ బాలుడు బ్యాంకు దగ్గరికి రావడం.. చోరీ చేయడం కనిపించింది. నిత్యం జనసంచారం ఉండే ప్రాంతం…రోడ్డు పక్కనే ఉండే బ్యాంకు ఆవరణలోకి బాలుడు ఒక్కడే ధైర్యంగా రావడం చూస్తుంటే ఎవరో డైరెక్షన్ ఇస్తే ఇలా చేశాడా? లేక తనంతట తనే చేశాడా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.

బయ్యారం- పందిపంపుల రహదారి పక్కనే ఉన్న ఎస్బిఐ బ్రాంచ్ ఆవరణలోకి బుధవారం రాత్రి ఇర్సులాపురానికి చెందిన 13 ఏళ్ల పిల్లాడు గడ్డపారతో వచ్చాడు. బ్యాంకు వెనుక వైపు ఉన్న గ్రిల్స్ తలుపు తాళం పగలగొట్టి… లోపలికి ప్రవేశించాడు. ఆ తర్వాత లోపల బ్యాంకులో ఉన్న అన్ని డిస్కులను చిందర వందర చేశాడు. డబ్బులు, నగలు ఏమైనా దొరుకుతాయేమోని గంటపాటు వెతికాడు. ఆ తర్వాత అక్కడి నుంచి బయటికి వెళ్లిపోయినట్లుగా సీసీటీవీ కెమెరాలో నమోదయింది. ఈ విషయాన్ని గురువారం ఉదయం స్వీపర్ పద్మ గమనించింది. బ్యాంకు తాళం పగలగొట్టి ఉండడాన్ని చూసి వెంటనే పై అధికారులకు తెలిపింది. వారు పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.

సీసీ టీవీ ఫుటేజీ సాయంతో ఆ బాలుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా ఓ పాత నేరస్తుడు బెదిరించడం వల్లే తానీ పని చేసినట్లుగా ఒప్పుకున్నాడని సమాచారం. బ్యాంకులో చోరీకి ప్రయత్నించిన బాలుడికి ఇటీవల దొంగతనాల్లో అనుభవం ఉన్న పాత నేరస్థుడు పరిచయం అయ్యాడు. అతను బాలుడిని మచ్చిక చేసుకుని బ్యాంకులో దొంగతనం చేయాలని బెదిరించినట్లుగా తెలుస్తోంది. వెనకనుంచి తనను బ్యాంకు గోడమీదికి ఎక్కించి..తను బైటికి వచ్చేవరకు అతను అక్కడే ఉన్నాడని, ఆ తర్వాతే ఇద్దరం ఎవరిళ్లకు వారు వెళ్లినట్లుగా బాలుడు పోలీసులకు తెలిపాడు. అతడి చెప్పిన సమాచారం మేరకు బ్యాంకు పరిసరాలతో పాటు బ్యాంకులో రికార్డయిన సిసిటీవీ ఫుటేజ్ ని పరిశీలించారు. ఇర్సులాపురంలో బాలుడిని అదుపులోకి తీసుకొని స్టేషన్ కి తీసుకువచ్చారు. ఆ తర్వాత విచారించగా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.


Updated : 30 Jun 2023 5:58 AM GMT
Tags:    
Next Story
Share it
Top