Home > తెలంగాణ > స్కూల్‌లో మందు కొట్టిన 9th క్లాస్ స్టూడెంట్స్

స్కూల్‌లో మందు కొట్టిన 9th క్లాస్ స్టూడెంట్స్

స్కూల్‌లో మందు కొట్టిన 9th క్లాస్ స్టూడెంట్స్
X

పాఠాలు నేర్చుకోవాల్సిన గురుకులంలో వయస్సుకు మించిన పనులు చేశారు 9 వ తరగతి విద్యార్థులు. పాఠశాలలో లిక్కర్(మద్యం) తాగడమే కాకుండా.. గుట్టు ఒక్కసారిగా బయటపడడంతో ఆ తప్పును స్కూల్ టీచర్ మీదకు నెట్టేశారు. ఉపాధ్యాయుడే తమచేత బలవంతంగా తాగించాడని కల్లబొల్లి మాటలు చెప్పి.. చివరకు అడ్డంగా బుక్కయ్యారు. ఈ షాకింగ్‌ ఘటన ములుగు మండలం మల్లంపల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఆలస్యంగా వెలుగు చూపింది.

వివరాల్లోకెళ్తే.. మల్లంపల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 9 వ తరగతి, ఇంటర్మీడియట్‌ చదువుతున్న 9 మంది పిల్లలు.. 'పెద్ద పెద్ద' పనులకు పాల్పడ్డారు. గత శనివారం రాత్రి వైన్ షాపులో మద్యం కొనుగోలు చేసి.. స్కూల్ లోనే సిట్టింగ్ వేశారు. వాళ్లు మద్యం తాగడాన్ని గమనించిన స్కూల్ పీఈటీ టీచర్‌ వారిని మందలించాడు. మరోమారు ఇలా చేయమని వారితో లెటర్‌ కూడా రాయించుకున్నారు. అయితే ఆ తర్వాత రోజు చెప్పా పెట్టకుండా విద్యార్థులు తమ ఇళ్లకు వెళ్లిపోయారు. పీఈటీ టీచర్‌ మద్యం తాగి వచ్చి తమను తిట్టాడని, పైగా ఆ లెటర్‌ ను తాము తాగినట్లు రాయించుకున్నాడని ఇంటి దగ్గరున్న అమ్మానాన్నలకు చెప్పారు. ఇదే నిజమే అనుకొని వారి మాటలు నమ్మిన తల్లిదండ్రులు.. ఆ మరుసటి రోజు పాఠశాలకు వచ్చి టీచర్లతో వాగ్వాదానికి దిగారు. సాంఘిక సంక్షేమ శాఖ రీజినల్‌ కో-ఆర్డినేటర్‌ విద్యారాణి, ఎమ్మార్వో సత్యనారాయణ స్వామికి మంగళవారం ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు.

దీంతో అధికారులు స్కూలుకు వెళ్లి విచారణ చేపట్టడంతో అసలు నిజాలు వెలుగు చూశాయి. 9 వ తరగతికి చెందిన విద్యార్థులు 7గరు, ఇంటర్మీడియట్‌ చదివే విద్యార్థులు ఇద్దరు మద్యం తాగారని విచారణలో తేలింది. మద్యం దుకాణంలో శనివారం రాత్రి విద్యార్థులు మద్యం కొనుగోలు చేసినట్లు సీసీ ఫుటేజీల ఆధారంగా బయటపడింది. అయితే ఇళ్లకు వెళ్లిన విద్యార్థులు తిరిగి పాఠశాలకు రాకపోవడంతో విద్యార్ధులపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రిన్సిపల్‌ అంకయ్య తెలిపారు. 21 ఏళ్లలోపు విద్యార్ధులకు మద్యం విక్రయించినందుకు మల్లంపల్లి శ్రీరామ వైన్స్‌పై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.

Updated : 13 July 2023 3:32 AM GMT
Tags:    
Next Story
Share it
Top